Politics

వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది!

వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది!

రాష్ట్రంలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు గత ప్రభుత్వం ఎన్నడూ 24 గంటల విద్యుత్తు ఇవ్వలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్తు సంస్థల ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, గత పదేళ్ల భారాస పాలనలో డొల్లతనంపై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థల పరపతి పడిపోయిందని, వీటి విలువ మైనస్‌ 30,876 కోట్లకు దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు రంగంపై ఆయన గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు రంగాన్ని గత ప్రభుత్వం నుంచి తాము వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును బాధ్యతాయుతంగా అందిస్తామన్నారు. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యుత్తు సంస్థలను అప్పుల నుంచి బయటపడేసి హరిత విద్యుత్తు మార్గంలో ముందుకు వెళ్తామని ప్రకటించారు. భట్టి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..

రాష్ట్ర విభజనకు ముందే 2,960 మెగావాట్ల మంజూరు
‘రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందుగానే తెలంగాణ ప్రాంతానికి 2,960 మెగావాట్లను అప్పటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ ఉత్పత్తి కేంద్రాలే నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలకపాత్ర పోషించాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి యూపీఏ ప్రభుత్వం 1,800 మెగావాట్ల విద్యుత్తు వచ్చేలా చట్టంలో నిబంధనలను రూపొందించింది. తెలంగాణ వచ్చాక ఏర్పడిన ప్రభుత్వం భద్రాద్రి విద్యుత్కేంద్రం నిర్మించడం ద్వారా కేవలం 1,080 మెగావాట్ల ఉత్పత్తిని మాత్రమే చేపట్టింది. దీనికి కాలం చెల్లిన సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీని వినియోగించడంతో ముడిసరకు వినియోగం పెరిగి ఏడాదికి రూ.200-300 కోట్ల నష్టం వాటిల్లనుంది. పైగా కాలుష్య సమస్య. రెండేళ్లలో పూర్తిచేస్తామన్న యాదాద్రి పవర్‌ ప్రాజెక్టును ఎనిమిదేళ్లయినా అందుబాటులోకి తీసుకురాలేదు. లోపభూయిష్టంగా ఉన్న ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడింది. యాదాద్రి కేంద్రాన్ని బొగ్గు సరఫరా అందుబాటులో లేని ప్రాంతంలో నిర్మించటంతో రవాణాకు రూ.800 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి వస్తుంది. ఆ కేంద్రం జీవితకాలం 30 సంవత్సరాలనుకుంటే వ్యయం మరింత భారంగా మారబోతోంది.

అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే 24 గంటల విద్యుత్తు ఇచ్చారా!
విద్యుదుత్పత్తికి ఒక ప్రణాళిక ఉండాలి. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత 4 -7 ఏళ్లలో విద్యుదుత్పాదన మొదలవుతుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే 24 గంటల విద్యుత్తు ఇచ్చామంటున్నారు. ఇదెలా సాధ్యం? 2014కు ముందే అప్పటి ఉత్పత్తి సామర్థ్యానికి దాదాపు మూడింతల అధికంగా ఉత్పత్తి చేయగల విద్యుత్కేంద్రాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ 15 వేల మెగావాట్లకు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం 38 వేల మెగావాట్లకు ప్రణాళిక వేసి ముందే ప్రాజెక్టులు ప్రారంభించాల్సి ఉన్నా.. అలా చేయలేకపోయింది. సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో విద్యుత్తు సంస్థలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు ఎన్జీటీకి వెళ్లిన వారిని ద్రోహులు అనడం సంస్కారం కాదు. గత ప్రభుత్వం చేసిన పాపాలు మేం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒప్పందం చెల్లుబాటులో ఉండగానే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేసి, వారికి నగదు చెల్లించారు.

కాలువల్లో నీరు పారితే.. బోర్లు ఎందుకు పెరిగాయి?
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 19.3 లక్షల నుంచి 27.99 లక్షలకు పెరిగాయి. రూ.లక్షల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులు నిర్మించి కాలువల ద్వారా సాగునీటిని సరఫరా చేస్తే ఎవరైనా బోర్లు వేస్తారా? 10 లక్షల అదనపు బోర్లు రైతులు ఎందుకు వేశారు? అంటే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందలేదని అర్థమవుతోంది. హైదరాబాద్‌ నగరానికి తాగునీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. గండిపేట, మంజీరా, కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరాను కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. విద్యుదుత్పత్తి సంస్థల అప్పులు పదేళ్లలో రూ.7662 కోట్ల నుంచి రూ.37,792 కోట్లకు పెరిగాయి. బకాయిలు రూ.9,743 కోట్లు, సింగరేణికి బొగ్గు బకాయిలు రూ.4553 కోట్లు, ట్రాన్స్‌కో అప్పులు రూ.9920 కోట్లకు పెరిగాయి. విద్యుత్తు కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చులు (ట్రూ అప్‌) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని చెప్పింది. కానీ ఆ మాట తప్పింది. వాటి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించడానికి ఇది కూడా కారణం. విద్యుత్తు సంస్థలకు సకాలంలో ఇవ్వాల్సిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోవటంతో విద్యుత్తు రంగం కుదేలైంది’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z