తెలంగాణలోకంటే ఎక్కువ వేతనం ఇస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖహాజరు విధానం రద్దు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వివిధ రూపాల్లో కార్యకర్తలు, ఆయాలు శనివారం ఆందోళన నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యకర్తల దీక్ష శిబిరాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో జలదీక్ష చేపట్టారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌లోనూ కార్యకర్తలు జలదీక్ష చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఏర్పాటుచేసి కార్యకర్తలు పూజలు చేశారు. పొర్లుదండాలు పెడుతూ ఆందోళన చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో మండుటెండలో నిరసన తెలియజేస్తుండగా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన వేమూరి ఊర్మిళ ఎండకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఇచ్ఛాపురం వచ్చిన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టరు ఎం.నవీన్, ఆర్డీవో భరత్‌నాయక్ కార్లను కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్‌వాడీల ఆందోళనకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మద్దతిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –