మానవ అక్రమ రవాణా( Human Trafficking) జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులు ప్రయాణిస్తోన్న విమానాన్ని ఫ్రాన్స్(France) విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ‘303 మంది ప్రయాణికులు, సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నాం. అలాగే వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. జాతీయ వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
రొమేనియా సంస్థ లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నుంచి నికరాగువా(Nicaragua)కు బయల్దేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆ ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా ఆ ప్రయాణికులంతా నికరాగువా(Nicaragua)కు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ ఘటన గురించి ఫ్రాన్స్ అధికారులు వెల్లడించినట్లు పేర్కొంది. ‘దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని వెల్లడించింది. ఆ ప్రయాణికులంతా యూఏఈలో పనిచేస్తుండొచ్చని లెజెండ్ సంస్థ పేర్కొంది. తమ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని విశ్వసిస్తున్నట్లు చెప్పింది.
👉 – Please join our whatsapp channel here –