Politics

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

భాగ్యనగరంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) శీతాకాల విడిది ముగిసింది. శనివారం ఆమె హకీంపేట వైమానిక కేంద్రం నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆనవాయితీలో భాగంగా బొల్లారంలోని తన నివాసంలో రాష్ట్రపతి శుక్రవారం తేనీటి విందు(ఎట్‌హోం)ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌, సీఎంలతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులందరినీ రాష్ట్రపతి పేరుపేరునా పలకరించారు. గవర్నర్‌ తమిళిసై ఆమెకు శివుడి ప్రతిమను బహూకరించారు.

కాగా, డిసెంబరు 18న శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ బొల్లారంలోని నివాసానికి రాష్ట్రపతి విచ్చేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా పోచంపల్లిని రాష్ట్రపతి సందర్శించారు. థీమ్‌ పెవిలియన్‌ పార్కులో చీరల తయారీ యూనిట్‌కు వెళ్లి.. అక్కడ కార్మికులు మగ్గాలపై నేస్తున్న చీరలను ఆసక్తిగా పరిశీలించారు. నేత కార్మికులతోనూ ముచ్చటించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z