DailyDose

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం- నేర వార్తలు

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం- నేర వార్తలు

 

*  ఒంగోలు నుంచి శబరిమల వెళ్తుండగా ఘోర ప్రమాదం

ఒంగోలు నుంచి శబరిమల వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాముల బస్సు లారీని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 30 మందికి గాయాలైనట్టు సమాచారం. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. మూడు రోజుల కిందట ఫ్రెండ్లి పరిచయాల పేరుతో తనను సీనియర్ విద్యార్థినులు ర్యాంగింగ్ చేశారని కామర్స్ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది.తమను రాత్రివేళల్లో వర్సిటీ హాస్టల్స్ రూముల్లోకి పిలుచుకుని పరిచయం చేసుకోవాలని సీనియర్ విద్యార్థులు దురుసుగా మాట్లాడుతున్నట్టు విద్యార్థి నులు తెలిపారు. అంతే కాకుండా క్యాంపస్ లోని ఆడిటోరియం దగ్గరకు తమను బలవంతంగా పిలిపించారని, అక్కడ రైళ్లలో పల్లీలు అమ్ముకునే తీరును తమకు చూపాలని, పాటలు పాడాలని, డ్యాన్స్ లు చేయాలని వేధింపులకు గురిచేసినట్లు జూనియర్ విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై. వెంకయ్య విచారణ నిర్వహించి మూడు రోజుల్లో వరుసగా 81 మంది విద్యార్థినులను వారం పాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో జువాలజీ విభాగంలో 25 మంది, కామర్స్, ఎకానమిక్స్ విభాగాల్లో 28 మంది చొప్పున ఉన్నారు.కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని పరిచయ వేదిక కార్యక్రమం పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడిన అంశాన్ని సీరియస్ గా తీసుకొని ముందు జాగ్రత్తగా విద్యార్థులకు హెచ్చరిక లాగా ఉండేందుకు సీనియర్లపై చర్యలు తీసుకున్నామని కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. హాస్టల్ డైరెక్టర్ సమక్షంలో పరిచయ కార్యక్రమం పూర్తైన తర్వాత మరోసారి హాస్టల్లో పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్న తీరును యాంటీ లాగిన్ కమిటీ నిర్ధారణ చేయడంతో ఐదు రోజుల పాటు హాస్టల్ నుంచి డిపార్ట్మెంట్లకు సంబంధించిన 81 మందిని సస్పెండ్ చేశామని వర్సిటీ వీసీ రమేష్ వెల్లడించారు.

చత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత

చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్‌పీఎఫ్‌ 2వ బెటాలియన్, సీఆర్‌పీఎఫ్‌ 111 బెటాలియన్‌లు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు.ఈ కూంబింగ్‌లో  భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో  గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును  చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్  తెలిపారు.

* అనంతపురం జిల్లాలో బస్సు ట్రాక్టర్‌ ఢీ

బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ నరేశ్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మంటలార్పుతుండగా ఫైర్ సిబ్బందికి గాయాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్‌లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బాలాజీ శానిటరీ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ఇది గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు తీవ్రం కావడంతో ఏడు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా శానిటరీ దుకాణంలో ఉన్న స్పిరిట్, కలర్‌ల వల్ల మంటలను ఆర్పుతున్న క్రమంలో ఫైర్ సిబ్బంది నలుగురికి గాయాలైనట్లు అగ్నిమాపక నిరోధక అధికారులు తెలిపారు.

ప్రాణాలు తీసిన రూమ్‌ హీటర్‌

చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు.   అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్‌ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ వాటర్‌ హీటర్‌ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు.  భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్‌ యాదవ్‌ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్‌ హీటర్‌ ఆన్‌ చేశాడు.ఈ క్రమంలో హీట్‌ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్‌, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z