Business

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు జరిమానా విధించిన ఆర్‌బీఐ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు జరిమానా విధించిన ఆర్‌బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda)కు మరోసారి భారీ మొత్తంలో జరిమానా పడింది. చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్‌కు ఆర్‌బీఐ (RBI) రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది.

చిరిగిన నోట్ల లావాదేవీల్లో నకిలీ నోట్లు గుర్తించడంతో అదనంగా మరో రూ.2,750 జరిమానా పడింది. డిసెంబరు 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది. గత నెల కూడా ఈ బ్యాంక్‌కు ఆర్‌బీఐ పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో రుణాలు జారీకి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.4.35 కోట్ల జరిమానా వేసింది.

డైరెక్టర్‌కు రుణం.. సహకార బ్యాంకుకు జరిమానా
మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (TDCC)కు ఆర్‌బీఐ రూ.2లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంకు తమ డైరెక్టర్లలో ఒకరికి రుణం మంజూరు చేసిన కారణంగా ఈ పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకులో ఇటీవల నాబార్డ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) తనిఖీలు నిర్వహించింది. డైరెక్టర్లలో ఒకరికి బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఈ తనిఖీల్లో తేలింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా టీడీసీసీకి ఆర్‌బీఐ పెనాల్టీ విధించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z