DailyDose

విద్యుత్తు వినియోగరులకు ఊరట

విద్యుత్తు వినియోగరులకు ఊరట

అపార్టుమెంట్లు, గృహసముదాయాల్లో విద్యుత్తు వినియోగరులకు ఊరట లభించనుంది. ఉమ్మడి మీటరు (Energy Meters) తీసుకున్న వారి నుంచి వసూలు చేసే వినియోగ ఛార్జీలను నియంత్రించాలని తాజాగా కేంద్ర విద్యుత్తుశాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అది ఏ మేరకు ఉండాలో ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) మరోసారి సమీక్షించి నిర్ణయించాక ఆ ఛార్జీనే డిస్కంలు వసూలుచేయాలని పేర్కొంది. ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీల్లోని విల్లాలు, అపార్టుమెంట్లలో అక్కడక్కడ ఉమ్మడి మీటరుతో కనెక్షన్లు తీసుకుంటున్నారు. వారు సాధారణంగా నెలకు 400 యూనిట్లకు పైగా వాడుతుంటారు. మామూలు కనెక్షన్‌ తీసుకుంటే… వాడే యూనిట్లు పెరిగే కొద్దీ యూనిట్‌ స్లాబ్‌ పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం నెలకు 400 యూనిట్లు దాటితే మామూలు కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారు యూనిట్‌కు రూ.10 చొప్పున చెల్లించాలి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రాష్ట్రంలో ఇలా ఉమ్మడి మీటరుతో కనెక్షన్‌ తీసుకుంటే మొదటి యూనిట్‌ నుంచి ఎంత కరెంటు వాడుకున్నా యూనిట్‌కు రూ.7.30 చొప్పున ఒకే ఛార్జీని డిస్కంలు వసూలు చేయాలని ఈఆర్‌సీ మార్చి 21న ఉత్తర్వులు జారీచేసింది. ఇది కాకుండా కనెక్షన్‌ లోడు సామర్థ్యంలో కిలోవాట్‌ను బట్టి కొంత అదనంగా ఉంటుంది. కానీ మధ్యతరగతివారు నివసించే కాలనీల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది కూడా ఎక్కువే అనే భావన ఉంది. అందుకే ఉమ్మడి మీటరుతో కనెక్షన్‌ తీసుకోడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం.. విద్యుత్‌ సంస్థల వాస్తవ ఖర్చులను విశ్లేషించి కొత్తగా యూనిట్‌ రేటు నిర్ణయించాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఒకే కనెక్షన్‌తో ఉమ్మడి మీటరు ద్వారా కరెంటు వాడుకునే ఇంటి యజమాని ఎవరైనా తనకు విద్యుత్తు వాహనం ఉందని, విడిగా మరో కనెక్షన్‌ ఇవ్వాలని అడిగితే తప్పకుండా ఇవ్వాలని సూచించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z