‘‘అమ్మా! నాకీ పెళ్ళి ఇష్టంలేదు’’ ఊర్మిళ మాటలకు కాత్యాయని తుళ్ళిపడింది.
మంచి కుటుంబం. అబ్బాయి రూపసి. విద్యాధికుడు. ఆర్జనాపరుడు. పిల్ల నిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచిరోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతోందో కాత్యాయనికి కొరుకుడు పడటం లేదు.
మూడేళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు… ఏ ఒక్కటీ ముడిపడలేదు.
పెళ్ళి ఆలస్యమవుతున్నకొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంత వరకే చూసేవాళ్ళు తప్ప, మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకుని ఖాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు… పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి.
‘‘ఎందుకిష్టం లేదు?’’ అడిగింది కాత్యాయని.
సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ‘‘ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేం తల్లీ. ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో’’ అంటూ చివాల్న గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయని.
పెళ్ళి వేడుకల్లో- ఇచ్చి పుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించటం సబబేనా!
‘కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్ళి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు’ అన్న మగపెళ్ళివారి మాటలు తనదాకా చేరాయి.
ఆ మాటలు వాళ్ళంటే తమవాళ్ళకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది.
‘‘ఊర్మిళ కిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే అరవై లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నాలడగటం లేదు గదా, వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్ళి జరిపించేసి, మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడ్తే సరిపోతుంది’’ అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి.
ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్యా వయసు అంతరం ఏడేళ్ళున్నా, ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరిమధ్యా ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ పెళ్ళి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్నివిధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది.
అయితే, ఆ రోజుల్లో మగ పెళ్ళివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో, ఇప్పుడు వీళ్ళూ అలానే మాట్లాడుతున్నారు.
ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో, పైసా కట్నం అక్కర్లేదన్నారనీ పెళ్ళి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారనీ ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు.
రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపొయ్యారు. పెద్దనాన్న కూడా పెళ్ళి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడలేదు.
ఊరంతా పందిరేసి, రంగవల్లులద్ది, ఎక్కడెక్కడి నుండో వంట వాళ్ళనూ వడ్డన వాళ్లనూ సినీ సెట్టింగుల వాళ్లనూ విద్యుద్దీపాల వాళ్ళనూ రప్పించి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్ళి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు. తనూ అలాగే అనుకుంది. పెళ్ళి ఖర్చుల కోసం- రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న రెండెకరాల మామిడి తోట అమ్మేశారు.
పెళ్ళయిన రెండేళ్ళ తర్వాత పండంటి బిడ్డకు తల్లయింది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్ళిలో కలవటమే. పెళ్ళవకముందంటే- పండగనో పేరంటమనో ఏదో వంకతో తను వెళ్ళి రెండు మూడు రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది.
బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తనూ వెళ్ళింది. అమ్మతనం మూర్తీభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది.
‘‘పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే’’ అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్‌లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది.
‘‘ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళా’’ అంటూ హాస్యమాడింది.
‘‘ఈ మాత్రానికి ఉద్యోగమే చెయ్యాలంటావేంటక్కా!’’
‘‘ఊఁ! ఇప్పుడంటే తల్లి చాటు పిల్లవి.
రేపు ఒక ఇంటి కోడలివయ్యాక తెలుస్తుంది… మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో’’ అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూడార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది.
ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్ళి కుదిరింది. రేణుక పిల్లాణ్ణి తీసుకుని వారం రోజులు ముందే వచ్చింది. తనూ రెండ్రోజుల ముందే పెళ్ళికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమోననుకుంది.
పెళ్ళికి రేణుక భర్త, అత్తింటివారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురూ గుసగుసలాడుకున్నారు.
‘‘అక్కా, బావగారు రాలేదేంటి?’’ ఉండబట్టలేక అడిగేసింది తను.
‘‘ఏం చెప్పనే. రకరకాల బిజినెస్‌లూ… టూర్లూ… బిజీ బిజీ… కట్టేసి తీసుకురాలేంగా’’ అంటూ ముఖాన నవ్వు పులుముకుంది.
పెళ్ళయ్యాక కూడా ఏడెనిమిది నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయగా బయటకు పొక్కింది.
‘‘ఊర్మిళా, బొట్టూ కాటుకా పౌడరూ పెర్ఫ్యూమ్సూ నేప్కిన్సూ… ఇలా మన ఆడవాళ్ళకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్టు ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చూ ఆస్తి కావచ్చూ. అంతేకానీ, ప్రతి చిన్న అవసరానికీ భర్త దగ్గర చేయి చాపాల్సివస్తే విలువ ఉండదు. చులకనగా చూస్తారు. అందరు భర్తలూ అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండం అని గ్యారంటీ ఏమిటి? మా వాళ్లు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారేగానీ ఒట్టి చేతుల్తో నన్ను అప్పగింతలు పెడ్తున్నామన్న స్పృహ లేకపోయింది’’ రేణుక మాటల్నిబట్టి వాళ్ళ మధ్య మనస్పర్థలకు కారణం కొంతవరకూ తను గ్రహించగలిగింది.
ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియలేదుగానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది.
‘‘ఏం లేదురా, పాండు పెళ్ళికి డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేస్తానందట రేణుక.
నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి, మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరమాడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది’’ అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది.
అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చనీ అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగుండొచ్చనీ తను అనుకుంది.
ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మానాన్నలూ అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్ళికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్ ఆహ్వాన పత్రికలూ మేళతాళాలూ వీడియోలూ ఫొటోలూ భోజనాలూ రిటన్ గిఫ్ట్‌లూ… పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషన్, భోజనాలు వగైరా వగైరాలను కలుపుకుంటే మొత్తం అరవై లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగూ ఆర్భాటాలు అవసరమా!?
‘‘ఏంటమ్మా, ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నా వంట?’’ తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి.
‘‘అవును నాన్నా!’’
‘‘ముందు నచ్చాడన్నావు?’’
‘‘అవును, నచ్చాడనే అన్నాను.’’
‘‘ఇంతలోనే ఏమైందమ్మా! నువ్వు సరేనన్నాకనే కదా ఖాయం చేసుకుంది.’’
‘‘అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం. ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పనిలేదా?’’
‘‘ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలూ పెట్టుపోతలూ ఆర్థిక విషయాలూ మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలూ కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు గదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు’’ సానుకూలంగా మాట్లాడింది తల్లి.
‘‘అవును. అందులో తప్పేం ఉంది. పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం.’’
‘‘అంత ఘనంగా చెయ్యటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా!’’
‘‘నిజమే, లేదు… నీ పెళ్ళి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్ళి సింపుల్‌గా జరిపించటానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్‌మెంట్ అమ్మి, వచ్చే డబ్బుతో వాళ్ళడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం.’’
‘‘నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదను కున్నారా?’’
‘‘నీకిస్తేనేం, నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనేం? రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని మీ భార్యాభర్తలేగా అనుభవించేది.’’
‘‘అలాగని నా పేర చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారిదాన్ని చేస్తారా?
అదే అపార్ట్‌మెంట్ నాకుంటే, దానిమీద నెలనెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికీ చేయిచాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు.’’
‘‘మీ అమ్మా నేనూ, ‘నీదీ నాదీ’ అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటూ లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య ‘అడుక్కోవడం’ అన్న భావనే సరికాదు.’’
‘‘మీ కాలమూ మీ అవసరాలూ మీ ఆలోచనలూ వేరు నాన్నా. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానూవచ్చు… రాక పోనూవచ్చు. వచ్చినా కుటుంబ బాధ్యతల మధ్య చెయ్యలేకపోనూ వచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి’’ నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ.
‘‘అపార్ట్‌మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి, పెళ్ళీ ఘనంగా చెయ్యాలంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చెయ్యలేం కదా. నిజానికిది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు’’ బతిమాలుతున్నట్లుగా అన్నాడు తండ్రి.
‘‘నాన్నా, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్నవాళ్ళు మన స్థితిగతుల్నీ చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది.
ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి.’’
‘‘అదేం మాటే. పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత ఆడపెళ్ళి వారిది’’ తల్లి కలుగజేసుకుంది.
‘‘అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళిష్టపడాలి. లేదంటే తమ స్థోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగానీ, మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా?
ఏది ఏమైనా, ఫ్లాట్ అమ్మి పెళ్ళి చెయ్యడానికి నేను ఒప్పుకోను. మా తాహతుకు మించి ఘనంగా ఏర్పాట్లు చెయ్యలేమని స్పష్టంగా చెప్పెయ్యండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం. లేదంటే మనకు తగ్గ
మరో సంబంధం చూసుకుందాం’’ ఇంతకన్నా తను చెప్పాల్సిందేంలేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది.
కూతురి మాటలకు భార్యభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకుంటూ స్థాణువుల్లా నిలుచుండిపోయారు.
👉 – Please join our whatsapp channel here –