WorldWonders

లక్షల మంది భక్తులు తయారు చేస్తున్న పట్టువస్త్రం!

లక్షల మంది భక్తులు తయారు చేస్తున్న పట్టువస్త్రం!

అయోధ్య రాముడి కోసం పవిత్రమైన పట్టు వస్త్రాన్ని మహారాష్ట్రలోని పుణెలో లక్షల మంది భక్తులు తయారు చేస్తున్నారు. ఆ పవిత్ర వస్త్రాన్ని నేసే ‘దో ధాగే శ్రీ రామ్‌ కే లియే’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. 13 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, హెరిటేజ్‌ హ్యాండ్‌వేర్‌ రివైవల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వస్త్రంపై శ్రీ రామనామం రాస్తున్నారు. ‘ఇక్కడ పవిత్రమైన వాతావరణం ఉంది. శ్రీరాముడికి ఓ వస్తువును అందిస్తున్నందుకు నేను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. శ్రీరాముడికి సమర్పిస్తున్న వస్త్రంపై రెండు దారాలు నేస్తున్నాం. ఇది మా భక్తితో చేసిన నైవేద్యం’ అని సంగీత పర్వత్‌ అనే భక్తురాలు తెలిపారు. ‘రామ జన్మభూమి కోసం చాలా పోరాటం జరిగింది. కానీ అంత దూరం వెళ్లలేనివారు చాలా మంది ఉన్నారు. అందుకే మేము రెండు దారాలతో నేసిన వస్త్రాన్ని శ్రీరాముడికి అందించబోతున్నాం. ఇది చేనేత కార్మికులకు దొరికిన గొప్ప అదృష్టం’ అని యోగేశ్‌ అనే చేనేత కళాకారుడు వెల్లడించారు. ఇప్పటివరకూ 8 లక్షల మంది ఈ వేదికను సందర్శించి శ్రీరాముడి కోసం పవిత్ర వస్త్రం నేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమమని ధవల్‌ మెహతా అనే భక్తుడు తెలిపారు. శ్రీరాముడికి వస్త్రాన్ని నేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నానని, తాను కచ్చితంగా రామ్‌ లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్తానని వెల్లడించారు. వస్త్రాన్ని పట్టుతో రూపొందించామని, వెండి జరీతో అలంకరించామని నిర్వాహకులు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z