అతడే ఒక సైన్యం’..
సినిమా పేరులోనో, పాటలోనో వినిపించే మాట..
‘అతడి కోసం ప్రైవేటు సైన్యం’..
బాపట్ల జిల్లాకు వెళ్లి ఎవరిని కదిపినా ఠక్కున చెప్పే మాట ఇదే..
నిజమే..
సరకు రవాణా లారీల నుంచి కమీషన్ వసూలు చేయాలన్నా.. సెటిల్‌మెంట్ల పేరిట దౌర్జన్యానికి దిగాలన్నా..
గ్యాస్ ఏజెన్సీల్లో దందా చేయాలన్నా..
రియల్టర్ల నుంచి కప్పం కట్టించుకోవాలన్నా..
రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకోవాలన్నా..
దుకాణాల నుంచి ప్రతి నెలా దండుకోవాలన్నా..
ఆ సైన్యమే అతడి అండా దండా..
ఇలా దోపిడీకి పేద, మధ్య తరగతి, ధనిక భేదం లేదనేలా..అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్నదెవరంటే.. వైకాపాకు చెందిన ఒక ముఖ్య నాయకుడు.. ‘యథా రాజా తథా నేత’ అనేందుకు ఆయనే ఓ ఉదాహరణ.. అధికారం అండతో వైకాపా నాయకులు నియోజకవర్గాల్లో రాజ్యమేలుతున్నారు. వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా వ్యవహరిస్తున్నారు. బాపట్ల జిల్లానే అందుకు నిదర్శనం. అక్కడి ఓ వైకాపా ముఖ్య నేత దాదాపు 80 నుంచి 100 మందితో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నాయకుడి కనుసన్నల్లో ఈ సైన్యం రాత్రింబవళ్లు పనిచేస్తోంది. ఒకటా రెండా.. గ్రానైట్ లారీల వద్ద కమీషన్ వసూలు చేసే దగ్గర్నుంచి సెటిల్‌మెంట్లు, అక్రమ వసూళ్లు, బెదిరింపుల వరకూ అన్నీ చక్కబెడుతోంది. సినిమాల్లో మాదిరి బల ప్రదర్శనకు దిగుతూ.. ఆదాయానికి తగినట్లు కమీషన్‌ను నిర్ణయిస్తూ.. వ్యాపారులను ఈ సైన్యం ఠారెత్తిస్తోంది. తన అరాచకాలకు దళితులను ముందు పెట్టడం.. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, మైనింగ్ ఇలా సకల శాఖల అధికారులను ఉపయోగించుకోవడం ఆయన స్టైల్. గ్రానైట్ రవాణాలో కమీషన్లకు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు పోలీసులను వినియోగిస్తున్నారంటే ఆయన అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ముఖ్య నేతకు కప్పం కట్టామని చెప్పేందుకూ బాధితులు భయపడాల్సిన పరిస్థితులను కల్పించారు.
వాట్సప్ గ్రూప్‌లో కోడ్ మెసేజ్‌లు..
హవాలాను తలదన్నేలా ఇక్కడ ఆ అరాచక శక్తి అక్రమాలను కొనసాగిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి బయటకొచ్చే వాహనాలను చెక్ చేసేందుకు 40 నుంచి 60 మందితో కూడిన ఈ ప్రైవేటు బృందం ఉంటుంది. వారిలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారనే సమాచారం కూడా ఒకరికొకరికి తెలియకుండా పర్యవేక్షకులు చూస్తుంటారు. ప్రత్యేకంగా మూడు ప్రైవేటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ వద్ద వాహనానికి రూ.35వేలు వసూలు చేయగానే.. దాని నంబరును ఈ సైన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూప్‌లో కోడ్ భాషలో మెసేజ్ పెడతారు. ఆ వాహనం ఫ్యాక్టరీ నుంచి నియోజకవర్గ సరిహద్దు దాటేంతవరకూ వీళ్లు చెక్ చేస్తుంటారు. కప్పం కట్టిన వాహనాలను మాత్రమే వదులుతారు. ఒకవేళ కప్పం కట్టని వాహనమైతే లోడుకు సంబంధించి పూర్తి బిల్లులు పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే ఎంతో కొంత తీసుకొని వదిలేస్తారు. లేదంటే నిర్దేశించిన మొత్తం కట్టాల్సిందే. కాదూ కూడదూ అంటే కేసు నమోదవుతుందంతే. ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు తోడుగా పోలీసులు ఉండడం అవాక్కయ్యేలా చేస్తోంది. మార్టూరుకు నలువైపులా జాతీయ రహదారి వెంట పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలనూ ఈ ప్రైవేటు సైన్యం కోసమే వినియోగిస్తుండటం గమనార్హం.
తిలాపాపం.. తలా పిడికెడు..
అధికార పార్టీకి చెందిన సదరు నేత అక్రమార్జనలో సింహభాగం గ్రానైట్‌దే. ఈ కలెక్షన్లకే ప్రైవేటు సైన్యాన్ని పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. మార్టూరులో దాదాపు 450 గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి నుంచి నిత్యం 60 నుంచి 100 లారీల లోడ్ వెళుతుంటుంది. ఫ్యాక్టరీ వద్ద లోడు ఎత్తగానే ఒక్కో వాహనానికి రూ.35వేల చొప్పున ప్రైవేటు సైన్యం కమీషన్‌ను వసూలు చేస్తుంటుంది. ఇందులో ఈ నాయకుడికి రూ.8వేలు, వైకాపాకు చెందిన పల్నాడులోని మరో ముఖ్య నేతకు రూ.8వేలు, ఒక గుత్తేదారు సంస్థకు రూ.7వేలు, వాహనాన్ని జిల్లా బోర్డర్ దాటించే వరకు చూసుకునే వాళ్లకు రూ.4వేలు చొప్పున వెళ్తుంటాయి. మిగిలిన రూ.9వేలు మాత్రం ప్రైవేటు సైన్యం వద్దే ఉంటాయి. ఈ వాహనాలను ఎక్కడైనా డిపార్ట్‌మెంట్ సిబ్బంది అడ్డుకుంటే.. వాటిని విడిపించేందుకు ఆ మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు.
కొత్త వెంచర్‌కు కమీషన్ ఇవ్వాల్సిందే..
ఈ ముఖ్యనేతను కలిసి, ఆయన అడిగినంత చెల్లిస్తేనే రియల్టర్లు వెంచర్లను వేసుకోవచ్చు. లేదంటే అనుమతులు రాకపోగా.. ‘ఈ లేఅవుట్‌లో ప్లాట్లు కొంటే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోం’ అని ఆయా గ్రామ పంచాయతీల పేరుతో ఆ స్థలంలో బోర్డు వెలుస్తుందంతే. ఈ ముఖ్యనేత దెబ్బకు భయపడి.. ఈ ప్రాంతంలో కొత్త వెంచర్లు వేయడమే మానేశారు.
వసూళ్ల పర్వమిదీ..
రోజుకు 60 నుంచి 100 గ్రానైట్ లారీల నుంచి రూ.8వేల చొప్పున నెలకు రూ.1.44కోట్ల నుంచి రూ.2.40కోట్ల వరకు..
సుమారు 150 మట్టి తరలించే వాహనాల నుంచి రోజుకు రూ.500 చొప్పున నెలకు రూ.22.50 లక్షలు
రోజుకు సుమారు 200 ఇసుక టిప్పర్ల నుంచి రూ.2,500 చొప్పున నెలకు రూ.కోటి.
శీతల గిడ్డంగుల నుంచి (32కిపైగా ఉన్నాయి) నెలకు రూ.లక్ష చొప్పున వసూలు..
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని ఒక మిల్లు ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ రూ.లక్షల్లో కమీషన్..
ప్రభుత్వ ఆదాయానికి గండి
గ్రానైట్‌ను బిల్లుతో తీసుకెళ్తే జీఎస్టీ, మైనింగ్ సెస్ కట్టాల్సి ఉంటుంది. ఈ రెండూ కలిపి ఒక్కో లారీకి రూ.లక్ష వరకు అవుతుంది. అలా బిల్లుతో వెళ్లే లారీల నుంచి కమీషన్ల వసూలు కుదరకపోవచ్చని.. సదరు నేత వారికో ఆఫర్ ఇచ్చారు. తమకు రూ.35వేలు కడితే బిల్లులేమీ అవసరం లేదని.. ఆ విధంగా మీకే డబ్బులు మిగులుతాయంటూ లారీల ప్రతినిధులకు నచ్చజెబుతుంటారు. వారు చెప్పినట్లు చేసిన వాహనాలను ఏ ఆటంకమూ లేకుండా సరిహద్దు దాటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అయితే, బిల్లులు లేకపోవడంతో ఇక్కడ సరిహద్దు దాటాక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణంగా ఇటీవల కొంతమంది బిల్లులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
కొండను మింగి..
మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ సర్వే నంబరు 387-సి11లో దాదాపు 350 ఎకరాల్లో ఉన్న ఎర్రమట్టి(గ్రావెల్) కొండకు ఈ నేత గుండు కొట్టేశారు. ఇక్కడి నుంచి రోజుకు సగటున 500 ట్రాక్టర్ల గ్రావెల్‌ను తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్టరుకు రూ.150 చొప్పున సీనరేజీ చెల్లించాలి. కానీ, ఎక్కువశాతం బిల్లులు లేకుండానే తరలిస్తున్నారు. టిప్పర్ అయితే రూ.3వేలు, ట్రాక్టర్ అయితే రూ.800 చొప్పున గుంజుతున్నారు.
రేషన్ దందా
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. లాభసాటిగా ఉండటంతో అధికార పార్టీలోని నాయకులే వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో దాడులకు తెగబడుతున్నారు. ఇప్పుడు సదరు ముఖ్య నేత కనుసన్నల్లోనే ఎక్కువగా జరుగుతున్న ఈ దందాకు కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఉన్న ఒక రైస్ మిల్లు ప్రధాన కేంద్రంగా మారింది. నియోజకవర్గంలో 210 రేషన్ దుకాణాలు ఉండగా.. ఒక్కో దాన్నుంచి సుమారు రూ.25వేల (బ్లాక్‌మార్కెట్ ధర ప్రకారం) విలువైన బియ్యం ప్రతి నెలా ఈ మిల్లుకు రావాల్సిందే. ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.కొన్ని ఫిర్యాదులు రావడంతో తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ అధికారులను అడ్డగించి, వారి ఫోన్లను ధ్వంసం చేసిన సంఘటన అప్పట్లో సంచలనమైంది.
అధికారుల బెంబేలు
పర్చూరుకు చెందిన ఓ వ్యక్తి కాలికి గాయం కావడంతో కదల్లేని పరిస్థితి. అయితే, బతికున్నా.. మృతి చెందినట్లుగా ఆయన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలని వైకాపా నేతలు ఫారం-7 దాఖలు చేయించారు. ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటరు జాబితా నుంచి తీయించేస్తున్నారీ ముఖ్య నేత. ఇప్పటికే 14 వేల ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తులు చేయించారు. పక్కనున్న చిలకలూరిపేటలో ఉపాధి కోసం వెళ్లిన వారి పేర్లనూ తొలగిస్తున్నారు. ఓటరు జాబితాలో అక్రమాలకు కాపు కాసినందునే ఇక్కడ ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్ బారినపడ్డారు. ఈ నేత ఒత్తిడి భరించలేక, మరోవైపు నిబంధనలు పాటించకపోతే చిక్కుల్లో పడతామనే భయంతో యద్దనపూడి తహసీల్దారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైతే, కారంచేడు తహసీల్దారు అనారోగ్యంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. పర్చూరు తహసీల్దారు కార్యాలయంలో ఎన్నివిధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు గుండెపోటుకు గురయ్యారు. మార్టూరు తహసీల్దారును బాధ్యతలు చేపట్టిన 20 రోజులకే మాట వినట్లేదని పంపించేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
మరమ్మతుల పేరిట మట్టి దోపిడీ
యద్దనపూడి మండలం నుంచి కారంచేడు వరకు పర్చూరు వాగు దాదాపు 22 కి.మీ.ల మేర ప్రవహిస్తోంది. దీనిని బాగు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే మరమ్మతుల పేరుతో ఈ ముఖ్య నేత వర్గీయులు వాగులో మట్టి దోపిడీ చేస్తున్నారు. కరకట్టకు గండ్లు పడటంతో పంటలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేతకు పలు అక్రమ చేపల చెరువులు ఉన్నాయి. ఆయన ఇంటి సమీపంలోనే ప్రధాన రహదారి వెంబడే ఉన్నా.. వాటిపై మాట్లాడేందుకు అధికారులు భయపడుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –