DailyDose

‘సన్‌బర్న్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్‌ పై సీఎం ఆగ్రహం

‘సన్‌బర్న్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్‌ పై సీఎం ఆగ్రహం

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో ‘సన్‌బర్న్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్‌ (Sunburn Festival) తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో జరిగినా వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్‌ను.. ఈసారి మాదాపూర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంటుకు సైబరాబాద్‌ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్‌ నిర్వాహకుల్ని, బుక్‌ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

గత వేడుకలో యువకుడి మృతి
సన్‌బర్న్‌ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 31న మాదాపూర్‌లో సన్‌బర్న్‌ పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకను సుమంత్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈవెంట్‌ను సన్‌బర్న్‌ పేరుతో నిర్వహిస్తామని, ఇందుకు కొంత మేర చెల్లిస్తానని నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈవెంట్‌ అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ఇంకా ఆమోదం లభించలేదు. బుక్‌ మై షోలో టిక్కెట్లు అమ్మకానికి పెట్టడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో శంషాబాద్‌లో నిర్వహించినప్పుడు ఈ వేడుకలో పాల్గొన్న యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో నిర్వహించినప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి.

గతంలోనూ నిరసనలు.. గతంలో సన్‌బర్న్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో పలుమార్లు నిర్వహించారు. అప్పట్లోనూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. 2017లో గచ్చిబౌలిలో నిర్వహించినప్పుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ముందు ధర్నాకు దిగారు. గతేడాది శంషాబాద్‌లో నిర్వహిస్తున్న సమయంలోనూ యూత్‌ కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలిపారు. సన్‌బర్న్‌ వేడుకలో డ్రగ్స్‌ విచ్చలవిడిగా విక్రయిస్తారని, ఇది అనేక నేరాలకు దారి తీస్తుందని ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z