Devotional

అయోధ్యలో హోటల్ గదులకు భారీ డిమాండ్

అయోధ్యలో హోటల్ గదులకు భారీ డిమాండ్

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు (Ayodhya Ram Mandir) జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. 84 సెకన్లపాటు శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలో ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలున్నట్లు తెలిపారు. వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఈ ముహూర్తం వివరాలను వెల్లడించారు. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి.

రూ.లక్ష దాటిన హోటల్‌ గది రేట్లు
రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలోని హోటల్‌ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్నిచోట్ల రేట్లు రూ.లక్షకు చేరాయి. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్‌ సాధ్యమవుతాయని అంటున్నారు. మరోవైపు భద్రతా కారణాలతో హోటల్‌ బుకింగులను అధికారులు రద్దు చేస్తున్నారు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకూ హోటళ్లున్నాయి. అందులో రెండు మూడే 4 స్టార్‌ హోటళ్లు. మిగిలినవన్నీ 2, 3 స్టార్ల హోటళ్లే.

శంఖనాద బృందానికి ఆహ్వానం

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పుణెకు చెందిన కేశవ్‌ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్‌ మహాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆహ్వాన పత్రిక పంపించారు. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి అక్కడ శంఖనాదం చేయనున్నారు.

నేపాల్‌ నుంచి శ్రీరాముడికి కానుకలు

కాఠ్‌మాండూ: అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్‌ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్‌పుర్‌ధామ్‌- అయోధ్యధామ్‌ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది. గతంలో నేపాల్‌లోని కలిగంధకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z