మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకొన్న 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజుల నిర్బంధం అనంతరం ఈ విమానం సోమవారం ఉదయం మళ్లీ బయలుదేరనుంది. అయితే, షెడ్యూలు ప్రకారం నికరాగువాకు వెళుతుందా.. వెనక్కు మళ్లించి దుబాయికి చేరుతుందా.. ఈ రెండూ కాకుండా భారత్‌కు పయనం అవుతుందా అన్నది వెల్లడించలేదు. రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానంలో గురువారం వీరంతా దుబాయి నుంచి నికరాగువాకు వెళుతూ మార్గమధ్యంలో ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో ఆగినపుడు ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నారు. దీనిపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించి స్థానిక అధికారులతో చర్చించింది. ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై ఆదివారం న్యాయవిచారణ ప్రారంభమైంది. పారిస్‌కు 150 కి.మీ.ల దూరంలో విమాన రాకపోకలు పరిమితంగా ఉండే వాట్రీ విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోర్టు సిబ్బందిని, తగిన సంఖ్యలో అనువాదకులను, న్యాయవాదులను అందుబాటులో ఉంచారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ చేపట్టిన బహిరంగ విచారణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.00 గంటలకు మొదలైంది. ఆ తర్వాత విమానం బయలుదేరేందుకు అనుమతులు రావడంతో.. విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ జడ్జీలు హియరింగును రద్దు చేశారు. ప్రయాణికుల్లో 11 మంది ఏ తోడు లేని మైనర్లు ఉన్నారు. 10 మంది ఫ్రాన్స్‌లోనే ఆశ్రయం పొందేందుకు అభ్యర్థించినట్లు సమాచారం.
హిందీ, తమిళం మాట్లాడారు..
ఫ్రెంచ్ మీడియా కథనాల మేరకు.. విమాన ప్రయాణికుల్లో కొందరు తమ బంధుమిత్రులతో ఫోన్లలో హిందీ, తమిళంలో మాట్లాడారు. ఓ కంపెనీ క్లయింటు కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. విదేశీయులను ఫ్రెంచ్ సరిహద్దు పోలీసులు నాలుగు రోజుల వరకు తమ అధీనంలో ఉంచుకోవచ్చు. జడ్జి అనుమతిస్తే దీన్ని మరో నాలుగు రోజులు పొడిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గరిష్ఠంగా 26 రోజులకు మించి విదేశీయులను అదుపులో ఉంచుకోకూడదు. మానవ అక్రమ రవాణా రుజువైతే ఆ నేరానికి 20 ఏళ్ల క్రిమినల్ జైలుశిక్ష, 30 లక్షల యూరోలు (రూ.27.5 కోట్లు) జరిమానా విధిస్తారు.
👉 – Please join our whatsapp channel here –