అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రముఖ హిందూ ఆలయం గోడలపై అభ్యంతరకర రాతలు కనిపించడం కలకలం రేకెత్తించింది. ఇది విద్వేషంతో చేసిన నేరంగా భావిస్తూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నెవార్క్ నగరంలో ప్రఖ్యాత ‘స్వామి నారాయణ్ మందిర్’ గోడలపై రాతల గురించి ఫిర్యాదు అందాక పోలీసులు ఆలయ వర్గాలతో మాట్లాడారు. ఇవి తమను బెదిరించడానికి ఉద్దేశించినవేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత వ్యతిరేక రాతలు ఎంతమాత్రం తగవని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ‘ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే చర్య. దీనిమీద అమెరికా సత్వర విచారణ జరిపి, దోషులపై తగిన చర్యలు చేపట్టాలి’ అని పేర్కొంది. ‘ఖలిస్థాన్’ అని ఒకచోట, ఇతర అభ్యంతరకర రాతలు మరోచోట ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లోని చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు ఇటీవల మరికొన్నిచోట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. తాజా ఘటనను అమెరికా ఖండించింది. కారకులైనవారిని దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు శాఖ చేపట్టిన చర్యల్ని ఆహ్వానిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ‘ఎక్స్’లో పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ శనివారం గాంధీనగర్‌లో మాట్లాడుతూ.. వేర్పాటువాద శక్తులకు విదేశాల్లో ఆశ్రయం ఎంతమాత్రం తగదన్నారు.
👉 – Please join our whatsapp channel here –