DailyDose

కారాగారంలో వసతుల కల్పనపై కమిటీ ఏర్పాటుకు ఆదేశం

కారాగారంలో వసతుల కల్పనపై కమిటీ ఏర్పాటుకు ఆదేశం

కారాగారాల్లో ఖైదీలకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సకాలంలో, సరైన వైద్యం పొందడం వారి హక్కు అని తెలిపింది. దిల్లీలోని జైళ్లలో సత్వరమే వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించటానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో డైరెక్టర్‌ జనరల్‌(ప్రిజన్స్‌), చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (దిల్లీ ప్రిజన్స్‌)తో పాటు ఇద్దరు సీనియర్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జీలు, దిల్లీ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, ఇద్దరు న్యాయవాదులు ఉండాలని తెలిపింది. ఈ కమిటీ నెల రోజుల్లో సిఫార్సులను అందజేయాలని పేర్కొంది. గుండెపోటు, ఆరోగ్యపరంగా మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే జైలులో తక్షణ ప్రాణ రక్షణ వ్యవస్థలు ఉన్నాయో, లేదో కూడా తెలపాలని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, జైలులో ఖైదీలుగా ఉన్న వారందరికీ సరైన వైద్య సదుపాయాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న అమన్‌దీప్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. తనకు అవసరమైన వైద్య సేవలు జైలులో సమకూరడంలేదని, 12 వారాల పాటు బెయిల్‌ మంజూరు చేయాలని అమన్‌దీప్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, నిందితుడిని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్చి, జైలు అధికారుల పర్యవేక్షణలో రెండు వారాల పాటు అవసరమైన వైద్య సేవలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z