DailyDose

సెలవుల విధానంపై ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు

సెలవుల విధానంపై ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు

పాఠశాల ఉపాధ్యాయుల్ని అణగదొక్కడమే లక్ష్యంగా ఉన్నతాధికారుల వ్యవహారశైలి ఉంది. ఇప్పటికే ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పాఠశాలల పరిశీలనకు వెళ్లిన సమయంలో విద్యార్థులు ఎవరైనా వర్క్‌బుక్స్‌ రాయకపోయినా, రాసిన పుస్తకాల్ని ఉపాధ్యాయులు కరెక్షన్‌ చేయకపోయినా బూతద్దంలో చూస్తున్నారు. బాధ్యులైన ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చి వారిని బెంబేలెత్తిస్తున్నారు. అది చాలదన్నట్లు ప్రస్తుతం ఉపాధ్యాయులు విధులకు హాజరై ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకోకపోయినా.. సెలవు పెట్టి ఆ వివరాల్ని యాప్‌లో అప్లోడ్‌ చేయకపోయినా దాన్ని ఉపాధ్యాయుడి తప్పు కింద చూపి వివరణలు కోరుతూ విద్యాశాఖ నోటీసులు జారీ చేస్తోంది.

సాంకేతిక లోపమైనా..
ఉదయం సెలవు పెడితే ఆ విషయం తాను 9గంటల్లోపే యాప్‌లో నమోదు చేసుకోవాలి. అదే మధ్యాహ్నం సెలవు పెడితే ఆ విషయం 12 గంటల్లోపు యాప్‌లో అప్లోడ్‌ చేయాలి. సాంకేతిక లోపంతో వివరాలు నిర్దేశిత సమయం లోపు అప్లోడ్‌ చేయకపోతే వెంటనే కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యా శాఖకు వివరాలు పంపుతున్నారు. ఇదే అదనుగా జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవు పెట్టి ఎందుకు యాప్‌లో లీవు లెటర్‌ అప్లోడ్‌ చేయలేదో ప్రశ్నిస్తూ సంజాయిషీ కోరుతున్నారు. ఈ పరిణామంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ప్రధానోపాధ్యాయులకు చెప్పినా కుదరదట
యాప్‌ పని చేయకపోయినా, సాంకేతిక లోపంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంలో జాప్యమైనా వెంటనే ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయంగా మాన్యువల్‌గా సెలవు చీటీ రాసి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తున్నారు. సెలవు విషయంలో ఇంత అప్రమత్తంగా ఉంటున్నా ఉపాధ్యాయుల్ని మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయితే సెలవుకు ముందు దాన్ని యాప్‌లో అప్లోడ్‌ చేసినా దాన్ని స్వీకరించదు. సెలవు పెట్టిన రోజే అప్లోడ్‌ చేసుకోవాల్సి వస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. యాప్‌లు, ఆన్‌లైన్‌ అటెండెన్స్‌లో సాంకేతిక సమస్యల వల్ల అనేక ఇబ్బందులు ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం యాప్‌లో అప్లోడ్‌ చేయలేదని సాకుగా చూపి వివరణలు కోరుతున్నారు.

గుంటూరులోనే ఒత్తిళ్లు ఎక్కువ..
పల్నాడు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులకు ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయులు ఎవరైనా స్కూళ్లకు వచ్చి హాజరు నమోదు చేసుకోకపోయినా, సెలవు పెట్టి దాన్ని యాప్‌లో అప్లోడ్‌ చేయకపోతే వెంటనే అది క్లియర్‌ చేసుకోవాలని విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా గుంటూరు జిల్లాలో అధికారుల తీరు ఉందని మండిపడుతున్నారు. ఈ మధ్య కాలంలో గుంటూరు జిల్లాలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటించడం, ఆయన పర్యటనల్లో అనేకచోట్ల లోపాలు ఉన్నాయని, వాటిని ముందుగా ఎందుకు గుర్తించలేదని జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఎందుకు వచ్చిన తంటా అని చెప్పి ప్రతి చిన్న దానికీ వివరణలు కోరుతూ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో పదుల సంఖ్యలో టీచర్లను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. అనివార్య కారణాలతో సెలవు పెట్టి ఆ సమాచారం హెచ్‌ఎంకు రాతపూర్వకంగా తెలియజేసినా యాప్‌లో అప్లోడ్‌ చేయలేదని వివరణ కోరడం సరికాదని, ఈ వైఖరిని మానుకోవాలని విద్యా శాఖ వర్గాలకు సంఘాలు సూచిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z