రైతులకు.. ముఖ్యమంత్రి జగన్ నమ్మక ద్రోహం చేశారు. ఉచిత పంటల బీమా అంటూనే.. వారిని నిలువునా ముంచారు. ప్రీమియం కూడా కట్టలేమని చేతులెత్తేస్తూ.. అన్నదాతలతో ఆటలాడుతున్నారు. ఖరీఫ్‌లో సర్వమూ కోల్పోయిన రైతులపై ఉదారత చూపాలనే ఆలోచన కూడా లేకుండా.. పంటనష్ట పరిహారాన్ని తగ్గించి ఇచ్చే కప్ అండ్ క్యాప్ (80-110) బీమా విధానాన్ని వైకాపా సర్కారు ఎంచుకోవడమే దీనికి కారణం. ఇందులో రూ.100 ప్రీమియం కడితే పంట నష్టానికి రూ.110 మించి పరిహారం ఇవ్వరు. అదే పంట నష్టం తగ్గినట్లు చూపిస్తే చెల్లించిన ప్రీమియంలోనే కొంత మొత్తాన్ని బీమా సంస్థలు వెనక్కి తిరిగిస్తాయి. అంటే పంటనష్టం తగ్గితే సర్కారు ఖజానాకు ప్రీమియం డబ్బు తిరిగి వస్తుంది. పంటల బీమా పరిహారం పెరిగితే బీమా సంస్థలు 110% వరకే అనుమతిస్తాయి. మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రీమియం రూపంలో చెల్లించాలి.
ఈ లెక్కలు తెల్చే నాటికి అంతా ఎన్నికల హడావుడి ఉంటుంది..ఒకవేళ చెల్లించాల్సి వచ్చినా కొత్త ప్రభుత్వమే భరించాలి. ఇవన్నీ ఎందుకులే అని పంటనష్టం తగ్గించుకునేందుకు లెక్కల్లో కోత పెడితే.. రైతులకు తీరని అన్యాయమే జరుగుతుంది. వాస్తవానికి ఈ ఏడాది తీవ్ర కరవు, తుపానులతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వాస్తవ సాగు కంటే ఈ ఏడాది బీమా చేసిన విస్తీర్ణమే తక్కువ. దానికీ ఎక్కువ ప్రీమియం ఎందుకనే ఆలోచనతో.. ప్రభుత్వం కోత పెట్టేందుకు సిద్ధపడింది. కనీసం ఆ ప్రీమియం సొమ్మునూ బీమా సంస్థలకు చెల్లించలేదు. జగన్ సర్కారు నిర్వాకం కారణంగా.. బీమా వ్యవహారం గందరగోళంగా మారనుంది. 2023-24లో ఆంధ్రప్రదేశ్ కప్ అండ్ క్యాప్ (80-110) విధానాన్ని ఎంచుకుందని వైకాపా ఎంపీలు ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్‌లు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఈ నెల 19న కేంద్రం సమాధానమివ్వడం గమనార్హం.
సొంతంగా అమలు చేయలేక.. రెండేళ్లకే చేతులెత్తేసిన జగన్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ప్రీమియం చెల్లించినా, సరైన పరిహారం ఇవ్వడం లేదని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 2020-21లో కేంద్ర బీమా పథకం నుంచి బయటకొచ్చారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొంతంగానే పంటల బీమా అమలు చేస్తామని రైతుల్ని నమ్మించారు. ఎన్ని ఎకరాలకు బీమా చేశారనే లెక్కలూ లేవు. వాస్తవ పంటనష్టం రూ.వేల కోట్లలో ఉన్నా.. ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు కుదించి చూపారు. మామిడికి ఎత్తేశారు. నిబంధనల పేరుతో మిరప, ఇతర పంటల రైతులకు సాయాన్ని మరిచారు. 2020-21 నుంచి రబీలో బీమా ఊసే లేదు. 2020-21, 2021-22లో ఖరీఫ్ వరకే పంటల బీమా అమలు చేసిన జగన్ సర్కారు.. ఇక తమ వల్ల కాదని చాప చుట్టేసి కేంద్రం చెంతకు చేరింది. దానికి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి.. తాము చెప్పిన నిబంధనలకు కేంద్రం అంగీకరించిందని, అందుకే మళ్లీ చేరామని నమ్మబలికింది. ఇప్పుడు కొత్త విధానం ఎంచుకుని రైతుల్ని ముంచే చర్యలకు పాల్పడింది.
ప్రీమియం తగ్గించుకునేందుకు..
రైతు సంక్షేమం అంటూ మాటలు తప్పితే.. అన్నదాతకు ఎంతమేర చేయూత ఇస్తున్నారనేది పంటల బీమా చూస్తేనే తెలుస్తుంది. 2022 ఖరీఫ్‌లో 50.90 లక్షల ఎకరాలకు పంటల బీమాకు కేంద్ర వాటా రూ.670 కోట్లతో కలిపి రూ.1,885 కోట్లు ప్రీమియాన్ని చెల్లించారు. 2023 ఖరీఫ్‌లో 70.85లక్షల ఎకరాలకు బీమా చేసేందుకు రూ.1,274 కోట్లు మాత్రమే చెల్లించనున్నారు. అంటే గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే బీమా చేసిన విస్తీర్ణం సుమారు 20 లక్షల ఎకరాలు పెరిగింది. చెల్లించాల్సిన ప్రీమియం రూ.611 కోట్లు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం కప్ అండ్ క్యాప్ (80-110) విధానాన్ని ఎంచుకోవడంతోనే ప్రీమియం భారం తగ్గిపోయింది.
పంటనష్టం చెల్లింపులో మూడు మోడల్స్ ఉన్నాయి. వాటిలో 1.లాభనష్టాలు, 2.కప్ అండ్ క్యాప్ (60-110), 2.కప్ అండ్ క్యాప్ (80-110). రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న విధానం ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చెల్లించాల్సిన ప్రీమియం రూ.1,274 కోట్లు. పంటనష్టం కింద చెల్లించాల్సిన పరిహారం మొత్తం ప్రీమియంలో 80% (సుమారు రూ.1,019 కోట్లు) కంటే దిగువన ఉంటే.. మిగిలిన 20%లో కొంతమొత్తం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. అంటే రైతులకు ఎంత ఎక్కువ ఇవ్వొచ్చు అనే ఆలోచన కాకుండా.. తిరిగి ఖజానాకు ఎంతొస్తుందనే ప్రభుత్వం ఆలోచించింది.
పంటనష్టం భారీగా జరిగితే.. బీమా సంస్థలు పరిహారంగా రూ.1,401 కోట్లకు (ప్రీమియంలో 110% వరకే పరిమితం) మించి చెల్లించవు. పరిహారం ఎంత పెరిగితే ఆ మేరకు ప్రీమియాన్ని ప్రభుత్వం మళ్లీ చెల్లించాలి. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన పంటనష్టానికి రూ.10వేల కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించినా తక్కువే. అంతస్థాయిలో రైతులు దెబ్బతిన్నారు. అయినా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించింది.
👉 – Please join our whatsapp channel here –