తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశం ముగిసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
‘‘సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేం. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే. గ్రామసభలు ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలి. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలి. అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలి. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు.. కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరు. ఎంతటివారైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి’’ అని సీఎం రేవంత్ చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –