DailyDose

తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 20 వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయి, మూడు నెలల క్రితం ప్రాథమిక, తుది కీలు వెల్లడయ్యాయి. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్‌ 4 పరీక్షలను ఓఎంఆర్‌ పద్ధతిలో, మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించారు.

ఇప్పటికే రాతపరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా 1:2నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌-4, ఏఈఈ, ఇతర పోస్టులకు మెరిట్‌ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు శనివారం హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

తుది కీ వెల్లడైన పరీక్షలు ఇవీ..సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టులకు ఆగస్టులో 2.5 లక్షల మంది అభ్యర్థులు సీబీఆర్‌టీ పరీక్షలు రాశారు. తుది కీ వెల్లడైంది. హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరి ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అవకాశం ఏర్పడుతుంది.

గ్రూప్‌-4లో 8,039 పోస్టులకు పరీక్షలు పూర్తయి తుదికీ వెల్లడైంది. జనరల్‌ ర్యాంకు జాబితాతో పాటు 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉంది. లైబ్రేరియన్లు (71 పోస్టులు), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ (18 పోస్టులు) పరీక్షల తుది కీలు సైతం విడుదలయ్యాయి.

1540 ఏఈఈ పోస్టులకు తుది కీతో పాటు జనరల్‌ ర్యాంకు జాబితా వెల్లడైంది. టీఎస్‌పీఎస్సీ పరిధిలో ఏఈఈ పోస్టులతో ఫలితాల వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసినా న్యాయవివాదంతో అడుగు ముందుకు పడలేదు.

యూనిఫాం సర్వీసుల విభాగంలో 16,969 పోస్టులకు తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే ఈ నియామక ఫలితాలపై న్యాయవివాదం తలెత్తడంతో అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిలిచిపోయాయి.

సమస్య ఇదీ..సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఈమేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది పరిష్కారమైతే.. వెంటనే 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది. టీఎస్‌పీఎస్సీ జారీచేసిన 22 ఉద్యోగ ప్రకటనల్లో గ్రూప్‌-2, 3, వసతిగృహ సంక్షేమాధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూప్‌-1 వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z