Health

శరీరాన్ని ఒత్తిడికి గురిచేసే ఏవైనా ఇన్ఫెక్షన్లు జుట్టు రాలడానికి కారణమవుతుందా?

శరీరాన్ని ఒత్తిడికి గురిచేసే ఏవైనా ఇన్ఫెక్షన్లు జుట్టు రాలడానికి కారణమవుతుందా?

సమస్య: నాకు 30 ఏళ్లు. ఇటీవల 21 రోజుల పాటు టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడ్డాను. కోలుకున్న తర్వాత జుట్టు ఊడటం ఎక్కువైంది. రోజురోజుకీ వెంట్రుకలు ఎక్కువెక్కువగా రాలుతున్నాయి. దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

ఒక్క టైఫాయిడ్‌ అనే కాదు.. శరీరాన్ని ఒత్తిడికి గురిచేసే ఎలాంటి ఇన్‌ఫెక్షన్లయినా జుట్టు ఊడేలా చేయొచ్చు. సాధారణంగా మనకు రోజుకు 80 కన్నా తక్కువ వెంట్రుకలు రాలుతుంటాయి. టైఫాయిడ్‌, కొవిడ్‌ వంటివి వచ్చినప్పుడు సహజంగా రాలాల్సిన ఈ వెంట్రుకలు విశ్రాంతి దశలోకి (కెటాజెన్‌ ఫేజ్‌) వెళ్తాయి. జ్వరం తగ్గిన మూడు నెలల తర్వాత ఇవి ఒక్కసారిగా రాలటం మొదలెడతాయి. దీన్నే అక్యూట్‌ టీలోజెన్‌ ఎఫ్లూవియం అంటారు. ఇందులో దువ్వినప్పుడు కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు ఊడుతుంటాయి. కొందరికి చేత్తో ముట్టుకున్నా రాలుతుంటాయి. ఇలాంటి స్థితి మూడు, నాలుగు నెలల వరకు ఉంటుంది. నూటికి 90 మందికి ఊడిన జుట్టు తిరిగి వస్తుంది. భయపడాల్సిన పనేమీ లేదు. కాకపోతే మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజూ గుడ్లు, మొలకెత్తిన గింజలు, పండ్లు, కూరగాయలు తినాలి. ‘అయ్యో జుట్టు ఊడిపోతోందే’ అని ఆందోళన చెందితే మానసిక ఒత్తిడి పెరిగి, మరింతగా ఊడిపోయే ప్రమాదముంది. కాబట్టి ప్రశాంతగా, ధైర్యంగా ఉండాలి. అవసరమైతే జుట్టు పెరగటానికి తోడ్పడే ప్రొటీన్లు, బయోటిన్‌ వంటి విటమిన్ల మాత్రలు వేసుకోవచ్చు. కఠినమైన బోరు బావి నీటికి బదులు మృదువైన మంచి నీటితో తల స్నానం చేయాలి. కెఫీన్‌, అమైనో ఆమ్లాలతో కూడిన షాంపూతో తలంటుకోవాలి. రోజూ రాత్రిపూట వెంట్రుకల కుదుళ్లకు కెపిక్సిల్‌ లేదా రెడెన్సీల్‌ వంటి ప్రొటీన్‌ సీరమ్‌లు రాసుకోవాలి. ఇవి నిద్రాణంగా ఉన్న వెంట్రుకల కుదుళ్లును ఉత్తేజితం చేస్తాయి. కొత్త వెంట్రుకలు మొలవటానికి తోడ్పడతాయి. ఇవి ఫలితం చూపించటానికి 3-4 నెలలు పడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు తిరిగి మొలవకపోతే పీఆర్‌పీ చికిత్స, మీసోథెరపీ ఉపయోగపడతాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z