లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్‌యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –