Sports

ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను నేడు ప్రారంభించనున్న జగన్

ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను నేడు ప్రారంభించనున్న జగన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఆడుదాం.. ఆంధ్ర’ క్రీడా పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు క్రీడాంశాలైన క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్‌ పోటీలకు సంబంధించి మొత్తం 1,57,548 మంది క్రీడాకారుల లక్ష్యాన్ని నిర్దేశించగా 1,53,423 మంది పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 89,255 మంది, మహిళలు 64,167 మంది ఉన్నారు. వీరితోపాటు క్రీడాభిమానులు 15,050 మంది నమోదు చేసుకోవడం విశేషం. జిల్లాలో మొత్తం 500 పైచిలుకు మైదానాలను పోటీల నిర్వహణకుగాను గుర్తించారు.

దశలవారీగా నిర్వహణ: క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం నుంచి మొదటిదశలో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో జరగనున్నాయి. జిల్లాలోని 691 సచివాలయాల పరిధిలో వచ్చేనెల జనవరి 9 వరకు వీటిని నిర్వహిస్తారు. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో ఇలా దశలవారీగా పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన తుది జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అందులో గెలుపొందిన జట్లకు మాత్రమే భారీగా నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

ప్రారంభోత్సవానికి తిరుపతి వేదిక..: పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కేంద్రమైన తిరుపతి వేదికైంది. స్థానిక ఎస్పీజేఎన్‌ఎం నగరపాలిక ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం 10 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

47 రోజుల పాటు..
తిరుపతి (కలెక్టరేట్‌): జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో మంగళవారం నుంచి 47 రోజుల పాటు జరగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలు పండుగ వాతావారణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి మొత్తం 1,53,423 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమం తిరుపతి నెహ్రూ మున్సిపల్‌ క్రీడామైదానం వేదికగా ప్రారంభమవుతుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z