భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి ‘హైడ్రోపోనిక్స్’ కోసం స్వీడన్ పరిశోధకులు ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని అభివృద్ధి చేశారు. ఈ తరహా మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయటం ద్వారా, మొలకలు 15 రోజుల్లో సగటున 50 శాతం కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్టు ‘పీఎన్‌ఏఎస్’ జర్నల్ తాజా కథనం పేర్కొన్నది. హైడ్రోపోనిక్స్ సాగుకు దోహదపడే ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని లింకోపింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిని స్టావ్రిండో నేతృత్వంలోని సైంటిస్టుల బృందం తయారుచేసింది. దీనికి వారు ‘ఈ-సాయిల్’ అనే పేరు పెట్టారు. ఎలిని స్టావ్రిండో మాట్లాడుతూ, ‘పర్యావరణ మార్పులకు తోడు ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతున్నది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఆహార డిమాండ్‌ను ఎదుర్కొనలేం. ‘హైడ్రోపోనిక్స్’ విధానంలో పట్టణ ప్రాంతాల్లో ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు’ అని అన్నారు. తమ పరిశోధన హైడ్రోపోనిక్స్ సాగును మరింత విస్తృతపర్చిందన్నారు. ప్రతికూల వాతావరణం, తక్కువ సాగుయోగ్యమైన భూమి ఉన్న చోట ‘హైడ్రోపోనిక్స్ సాగు’ పరిష్కారం చూపుతుందని చెప్పారు.
హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటే?
హైడ్రోపోనిక్ ఫార్మింగ్.. ఇటీవల పట్టణాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. భూమి లేదా మట్టి అవసరం లేకుండా, మనం ఎంచుకున్న చోట కేవలం నీటి ఆధారంగా పంటలు సాగు చేపట్టడాన్ని ‘హైడ్రోపోనిక్ ఫార్మింగ్’ అని పిలుస్తారు. మొక్కల ఎదుగుదలకు నీరు, పోషకాలు అవసరమైనంత అందించేందుకు క్లోజ్డ్ సిస్టమ్ ఏర్పాటుచేస్తారు. క్లోజ్డ్ సిస్టమ్ సమర్థంగా పనిచేసేందుకు ‘ఈ-సాయిల్’ను సైంటిస్టులు తయారుచేశారు. కూరగాయలు, ఔషధ గుణాలుండే మొక్కల్ని పెంచేందుకు ఈ తరహా సాగు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానాన్ని అనుసరించి పంటను పొందవచ్చు. కలుపు సమస్య, చీడపీడల బాధ పెద్దగా ఉండదని నిపుణులు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –