DailyDose

పాఠ్య పుస్తకాల బరువుతోపాటు ధరలు కూడా తగ్గనున్నాయి!

పాఠ్య పుస్తకాల బరువుతోపాటు ధరలు కూడా తగ్గనున్నాయి!

రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల బరువుతోపాటు ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుస్తకాల ముద్రణకు 90 జీఎస్‌ఎం(చదరపు మీటరుకు బరువు గ్రాముల్లో) మందంతో కూడిన కాగితానికి బదులు 70 జీఎస్‌ఎం మాత్రమే వాడాలని సర్కార్‌ భావిస్తోంది. గత విద్యా సంవత్సరం(2022-23) వరకు 70 జీఎస్‌ఎం కాగితాన్నే ముద్రణకు వినియోగించేవారు. ఇటీవల కాలం వరకు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ దాన్ని 90 జీఎస్‌ఎంకు పెంచారు. ఒక పుస్తకాన్ని తెలుగు- ఆంగ్ల భాషాల్లో ముద్రిస్తున్నారు. దీంతో ఒక పుస్తకాన్ని రెండు భాగాలుగా చేసి ముద్రిస్తున్నారు. అయిదు నెలలకు అంత మందం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తమైనా ప్రస్తుత విద్యా సంవత్సరం(2023-24) 90 జీఎస్‌ఎంతో పుస్తకాలను పంపిణీ చేశారు. బరువుతోపాటు ధరలు 40- 50 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు 10వ తరగతిలో ఎనిమిది పుస్తకాల ధర రూ.1074 ఉండగా అది రూ.1600 వరకు పెరిగింది. పుస్తకాల బరువు తగ్గించాలని తెలంగాణ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం కొత్తగా నియమితులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరింది. ఆయన పాఠశాల విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. మందం తగ్గితే సర్కార్‌కు దాదాపు రూ.50 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సీఎం కార్యాలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

నేటితో టెండర్‌ గడువు ముగింపు
పుస్తకాల ముద్రణకు 90 శాతం జీఎస్‌ఎం కాగితం కావాలని కొద్ది రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఆ గడువు బుధవారంతో ముగియనుంది. కాగితం మందంపై తుది నిర్ణయం వెలువడితే టెండర్లను రద్దు చేయవచ్చని, మళ్లీ రీ టెండర్‌ పిలవవచ్చని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z