Business

దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని దిల్లీ (Delhi) వణుకుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో పొగమంచు (Dense Fog) నగరాన్ని కప్పేసింది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రవాణా వ్యవస్థపై పొగమంచు పెను ప్రభావం చూపిస్తోంది. విమానాలు (Flights), రైళ్ల (Trains) రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే వాతావరణ శాఖ దిల్లీలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

పొగమంచు దట్టంగా వ్యాపించడంతో ఉదయం కూడా రాత్రిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు తగ్గింది.

పొగమంచు కారణంగా దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. దిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారిమళ్లిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం పడింది. రాజధానికి రావాల్సిన దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z