తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలంటూ మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులంటే ఎంతో ప్రేమాభిమానాలు కురిపించి, వారు చేస్తున్న వృత్తిపట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లలో తమకు ఏం చేశారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తులు అరణ్యరోదనగానే మిగిలాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో చుట్టూ ఉన్న గ్రామాలను విలీనం చేయడంతో నగరాల, పట్టణాల విస్తీర్ణం పెరిగింది. అదే స్థాయిలో కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలన్న వారి డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెరిగిన పని ఒత్తిడి మేరకు వేతనమైనా పెంచారా అంటే అదీ లేదు. ఒక్కో కార్మికుడికి రూ.15 వేల వేతనం ఇస్తున్నారు. ఆరోగ్య భత్యం (హెల్త్ ఎలవెన్స్) కింద ఇచ్చే రూ.6 వేలను కరోనా తరువాత ప్రభుత్వం నిలిపివేయడంతో కార్మికులు ఆందోళన చేసి తిరిగి సాధించుకోవాల్సి వచ్చింది.
👉 – Please join our whatsapp channel here –