ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. తాజాగా సినీపరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్‌కు ఆహ్వానాలు అందాయి.
‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కు తాజాగా ఆహ్వానం అందింది. ఆయనతోపాటు కన్నడ స్టార్ యశ్, బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ దేవోల్, టైగర్ ష్రాప్, ఆయుష్మాన్ ఖురానా కూడా అతిథుల జాబితాలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్‌లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషభ్ శెట్టికి కూడా ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha)కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.
జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. 22న గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులతోపాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవనున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –