బుద్దిగా చదువుకున్నాడు. ఓ కేసులో జైలుకెళ్లొచ్చాక దొంగగా మారాడు. 28 ఏళ్లకే చోరీల్లో సెంచరీ దాటాడు. ఇటీవల వరుస దొంగతనాలతో హల్‌చల్ చేయడంతో నిఘా ఉంచిన ఓయూ పోలీసులు ఘరానా దొంగ ఆటకట్టించారు. చోరీల్లో ఇతడి విభిన్నశైలి పోలీసులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, డీఐ శ్రీనివాసరావు, ఎస్సై యాసీన్‌అలి, ఏఎస్సై ఈశ్వర్‌తో కలసి ఓయూ ఏసీపీ ఎస్.సైదయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్(28) అలియాస్ రాజేశ్‌రెడ్డి అలియాస్ రంగారావు, ఇలియాజ్ ఖాన్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో 2012లో బీ ఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్ పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. అక్కడ చోరీ కేసులో అరెస్టయిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీలు బాటపట్టాడు. కొట్టేసిన విలువైన వస్తువులు విక్రయించడం, తాకట్టు పెట్టడం.. వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించాడు. మగ వారితో చనువుగా ఉంటూ.. వారి కోసం ఎంతకైనా తెగించే వాడు. వారిని సంతోషపెట్టేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యేవాడు. వారికి డబ్బు అవసరమైందని తెలిస్తే చాలు అదే రోజు ఏదో ఒక ఇంట్లోకి చొరబడి క్షణాల్లో నగదు, నగలు చోరీ చేయడం ఇతడి ప్రత్యేకత. ఏపీ, తెలంగాణాల్లోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో ఇతడు మోస్ట్‌వాంటెండ్ దొంగ. ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా తప్పించుకు తిరుగుతాడు. పెద్ద లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తాడు. ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించేందుకు ఇష్టపడతాడు. పోలీసులకు పట్టుబడిన సమయంలో రూ.5వేల విలువైన చెప్పులు, రూ.11 వేల విలువైన దుస్తులతో టిప్‌టాప్‌గా తయారై ఉన్నాడు.
ఏది చేసినా లెక్కలు పక్కా
గతంలో ఇతడు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడు కొట్టేసిన నగలు 10 తులాలైతే.. 20 తులాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పట్టుబడినపుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవటంతో రూటు మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడ దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన నగదు, నగలు వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూసి నమ్మించే ప్రయత్నం చేసేవాడు. పగటిసమయంలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గమనించేవాడు. అక్కడ చోరీ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేవాడు. అనువుగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని రాత్రివేళ చిన్న ఇనుపరాడ్‌తో బయల్దేరేవాడు. ఇంటితాళం పగులగొట్టి విలువైన వస్తువులు కాజేసి మాయమయ్యేవాడు. చేతిలో డబ్బంతా అయిపోగానే మళ్లీ రంగంలోకి దిగుతాడు. 2022లో మేడిపల్లి పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు పంపారు. అప్పటికి 94 దొంగతనాలు చేసినట్టు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. ఓయూ పరిధిలో మూడు, ఉప్పల్, కాచిగూడ, జడ్చర్ల టౌన్, సంగారెడ్డి రూరల్, నాగర్ కర్నూల్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 9 చోట్ల దొంగతనాలు చేశాడు. సెప్టెంబరులో ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వీధి నెంబర్ 5లో నివాసముండే లగిశెట్టి రాజు ఇంట్లో 19.1తలాల బంగారం, కొన్ని యూఎస్ డాలర్లు, కొంత నగదు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుమండలం డీసీపీ సునీల్‌దత్ పర్యవేక్షణలో ఓయూ పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. అమీర్‌పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్‌నాయక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.13.50 లక్షల విలువైన ఆభరణాలు, ద్విచక్రవాహనం, మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఎస్సార్‌నగర్‌లోని ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు, ప్రముఖ బంగారు దుకాణాల్లో తాకట్టు పెట్టినట్టు నిందితుడి వద్ద రశీదులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా అక్కడ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. కరడుగట్టిన దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు కృష్ణ, ప్రభాకర్, నరేశ్, రమాకాంత్‌లను డీసీపీ సునీల్‌దత్ అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –