DailyDose

అంబేడ్కర్ వర్సిటీ:ఏపీ నుంచి 250 కోట్లు రావాల్సి ఉంది!

అంబేడ్కర్ వర్సిటీ:ఏపీ నుంచి 250 కోట్లు రావాల్సి ఉంది!

రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దాదాపు రూ.250 కోట్లు రావాల్సి ఉండగా, ఒక్క రూపాయి కూడా రాలేదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ (Ambedkar University) ఉపకులపతి ఆచార్య కె.సీతారామారావు తెలిపారు. పదో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌తో వర్సిటీకి ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న బంధం తెగిపోతుందని ఆయన స్పష్టంచేశారు. విభజన అనంతరం కూడా విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలందిస్తోందని… అయితే జీతాలు, నిర్వహణకు ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈనెల 28న వర్సిటీ 25వ స్నాతకోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

43 మందికి బంగారు పతకాలు…ఈ నెల 28న జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్‌ తమిళిసై, యూజీసీ ఆచార్యులు జగదీశ్‌కుమార్‌ హాజరవుతున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సీతారామారావు తెలిపారు. 2019-22 సంవత్సరానికిగాను డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో మొత్తం 31,729 మంది ధ్రువపత్రాలు స్వీకరించనున్నారని తెలిపారు. అయిదుగురు ట్రాన్స్‌జెండర్లు సైతం డిగ్రీ పట్టాలు అందుకోనున్నారన్నారు. ఈసారి 43 మందికి బంగారు పతకాలు అందిస్తుండగా అందులో 32 మంది మహిళలని పేర్కొన్నారు. వివిధ కేంద్ర కారాగారాల నుంచి ఈసారి 148 మంది ఖైదీలు డిగ్రీ, పీజీల్లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వీరిలో ఒకరు బంగారు పతకం అందుకోనున్నారని వెల్లడించారు. యంగిలిశెట్టి శ్రీరాములు అనే విద్యార్థి 3 బంగారు పతకాలు సాధించారని తెలిపారు. అంబేడ్కర్‌ వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య వి.ఎస్‌.ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z