ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బిహార్‌లో గంగానదిపై ఆరు వరుసల వంతెన నిర్మాణం, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో కాన్సులేట్ జనరల్ ప్రారంభం సహా పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. బిహార్‌లోని డిఘా- సోనేపుర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గంగా నదిపై ఆరు లైన్ల వంతెన నిర్మాణానికి ఆమోదం లభించింది. మొత్తం రూ.3064.45 కోట్ల వ్యయంతో ఈ వంతెనను 4.56కి.మీల మేర నిర్మించనున్నారు. పనులు ప్రారంభించినప్పటి నుంచి 42 నెలల్లోపు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ వంతెన నిర్మాణం ద్వారా ట్రాఫిక్ వేగంగా కదలడంతో పాటు బిహార్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడనుంది. అలాగే, ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది.
ఆక్లాండ్‌లో భారత కాన్సులేట్ జనరల్
న్యూజిలాండ్‌లో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసించే ఆక్లాండ్ నగరంలో త్వరలో కాన్సులేట్ జనరల్‌ను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 12 నెలల్లోగా కాన్సులేట్‌ను ప్రారంభించి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించడం వల్ల దౌత్యపరమైన అవకాశాలు మెరుగుపడతాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఆక్లాండ్‌లోని భారతీయ సమాజానికి మెరుగైన సేవలందుతాయి. న్యూజిలాండ్‌లో దాదాపు 2.5లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తుండగా.. వారిలో ఒక్క ఆక్లాండ్‌లోనే 1.7లక్షల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భారత్-న్యూజిలాండ్ బిజినెస్ కౌన్సిల్ సైతం ఆక్లాండ్‌లో ఉండగా.. భారత హైకమిషన్ మాత్రం వెల్లింగ్టన్‌లో ఉంది.
ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2024 కాలానికి గత సీజన్ కంటే మిల్లింగ్ కొబ్బరి క్వింటాల్‌కు రూ.300; బాల్ (గుండ్రని) కొబ్బరికి రూ.250ల చొప్పున పెంపునకు ఆమోదం తెలిపారు. దీంతో ఎండు కొబ్బరి (మిల్లింగ్) క్వింటాల్ ధర రూ.11,160 కాగా; ఎండుకొబ్బరి (బాల్) ధర రూ.12వేలకు చేరనుంది.
త్రిపురలోని ఖోవాయి-హరీనా రహదారిని 135 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1511.70 కోట్ల కాంపోనెంట్ రుణంతో పాటు మొత్తం 2,486.78 కోట్ల పెట్టుబడులతో ఈ రహదారిని విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల త్రిపురలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. కైలాషహర్, కమల్‌పూర్, ఖోవై బోర్డర్ చెక్‌పోస్టు ద్వారా బంగ్లాదేశ్‌కు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
👉 – Please join our whatsapp channel here –