వైకాపా నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(తితిదే) సైతం వదలడం లేదు. తితిదే ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను సొసైటీ ద్వారా కేటాయించాల్సి ఉన్నా తామే ముఖ్యమంత్రి జగన్‌ను ఒప్పించి తితిదే తరఫున నేరుగా ఇప్పిస్తున్నామన్న భావనను వారిలో కలిగేలా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చక్రం తిప్పారు. ఈ మేరకు తితిదే ఉద్యోగులకు ఇచ్చే ప్రొసీడింగ్స్ కాపీపై ముఖ్యమంత్రి జగన్ ఫొటో ముద్రించడం ఇందుకు నిదర్శనం. సీఎం బొమ్మ చుట్టూ ప్రభుత్వం ‘నవరత్నాలు’ పేరుతో అందిస్తున్న పథకాలను సైతం ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొమ్ము తితిదేది.. సోకు నాయకులది అన్నచందంలా పరిస్థితి నెలకొందనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వం నుంచి తాము భూమిని కొనుగోలు చేస్తున్నామని, ఉచితంగా ఇవ్వడంలేదని అలాంటప్పుడు ప్రొసీడింగ్స్‌పై సీఎం బొమ్మ ఎందుకు ముద్రించారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి చిత్రాన్ని ముద్రించిన పత్రాలను అందిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –