కొన్ని ప్రత్యేక హంగులు ఉండేలా రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. దానికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఈ రెండు తరగతుల్లో ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసేదీ తెలిపే పట్టికను దానికి జతచేసింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని (రీయంబర్స్ చేయని) రాయితీ/ ఉచిత టికెట్లను ఈ రైల్లో అనుమతించబోరు. రైల్వే సిబ్బందికి ఇచ్చే పాసులు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీవో)ల విషయంలో నిబంధనలు.. మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా ఉంటాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల టికెట్ల సొమ్మును ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నందువల్ల వారి పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయి. అయోధ్య నుంచి బయల్దేరేలా తొలి అమృత్ భారత్ రైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 30న ఆ నగరంలో జెండాఊపి ప్రారంభించనున్నారు. తొలిరైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –