మీకు వైకాపా అండగా ఉంటుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తాం. అప్పటివరకు ఓపిగ్గా ఉండండి.
రాష్ట్రంలో ఆరోగ్యమిత్రలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. వైకాపా అధికారంలోకి రాగానే వారి డిమాండ్లన్నీ నెరవేరుస్తామని భరోసానిచ్చిన జగన్.. అయిదేళ్ల పదవీకాలం ముగియబోతున్నా చెప్పినవి మాత్రం చేయలేదు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఆరోగ్యమిత్రలుగా పనిచేసే వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగలేదు. ఉద్యోగ భద్రత లేకుండానే అత్తెసరు వేతనాలతో వారు పనిచేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ఇన్నాళ్లు అధికారులకు పదే పదే వినతిపత్రాలు అందించసాగారు. చివరిగా సీఎంను కలిసేందుకు వారు ప్రయత్నిస్తున్నా కలవడం సాధ్యం కాలేదు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నడపలేక.. ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోయి.. పిల్లలను చదివించుకోలేక… ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నామని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలకు అనర్హత!
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వేతనాలను నామమాత్రంగా పెంచారు. కానీ, వారికి ఆ సంతోషం ఎంతోకాలం లేదు. ఆదాయ పరిమితి పేరిట ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హతను కోల్పోయారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వేతన రూపంలో రూ.15వేలు తీసుకుంటున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. దాంతో వారంతా సంక్షేమ పథకాలకు అనర్హులయ్యారు. అమ్మఒడి కింద ఆర్థిక సాయం, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి ఉచితంగా చికిత్స పొందే అవకాశాలను కోల్పోయారు. వీరికి తెల్లరేషన్ కార్డు కూడా జారీ చేయట్లేదు. ఇతర ఉద్యోగాల భర్తీలో ఆరోగ్యమిత్రలుగా పనిచేసే వారికి ప్రాధాన్యం (వెయిటేజ్) కూడా ఇవ్వడం లేదు. కొవిడ్ బాధితులకు వీరు కీలక సేవలు అందించారు. మరోవైపు ‘ఆరోగ్యమిత్ర’.. ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ కేటగిరీల జాబితాలో లేనే లేదు. దీనివల్ల వీరి ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. డిగ్రీ అర్హత కలిగినా పొరుగుసేవల కింద పనిచేస్తున్నారు.
రోగులకు సహాయకారులుగా..
ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలు సేవలు అందిస్తున్నారు. డిగ్రీ అర్హతతో జిల్లాల్లో రాత పరీక్ష ద్వారా ఆరోగ్యమిత్రల నియామకం జరిగింది. ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందేందుకు వచ్చే రోగుల వివరాలు, నిర్ధారణ పరీక్షల ఫలితాలు, వైద్యుల సిఫార్సులను ఆన్‌లైన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయానికి పంపి, చికిత్స ప్రారంభానికి ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్) వచ్చేలా చేస్తున్నారు. ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందిన వారు డిశ్ఛార్జి అయి ఇళ్లకు వెళ్లే సమయంలో కేసు షీట్లను మళ్లీ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపించేలా, రోగులకు ఆసరా కింద ఆర్థిక సాయం చెల్లింపులు జరిగేలా చేయడంలోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినా వీరికి ఉద్యోగ భద్రత కొరవడింది.
రవాణా ఖర్చులు అదనం..
ఆరోగ్యమిత్రల్లో కొందరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొద్దికాలం పనిచేశారు. అయితే అక్కడ వీరి సేవలు అవసరం లేదన్న కారణంతో తప్పించారు. ఈ క్రమంలో కొందరిని దూర ప్రాంతాల్లోని ఇతర ఆసుపత్రులకు బదిలీ చేశారు. దాంతో ఇళ్ల నుంచి రాకపోకలు సాగించేందుకు కొందరు నెలకు రవాణా ఖర్చుల కింద రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలకు వచ్చే రూ.15వేలల్లో రవాణా కోసం పోను.. మిగిలిన జీతంతోనే కుటుంబాలను ఎలా పోషించగలమని ఆరోగ్యమిత్రలు ప్రశ్నిస్తున్నారు. తమ హోదాకు తగ్గ కేటగిరీ సృష్టించాలని, హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు అభ్యర్థిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –