DailyDose

రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీకి పెరుగుతున్న ఆదరణ

రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీకి పెరుగుతున్న ఆదరణ

దేశంలో ఎక్కడి నుంచైనా ఆహార ధాన్యాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్న రేషన్‌ కార్డు పోర్టబిలిటీ సదుపాయానికి ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి 11 నెలల్లోనే 28 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019లో వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలి దశలో నాలుగు రాష్ట్రాలకే పరిమితం చేయగా.. ఆ తర్వాత 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించారు. ఈ విధానంలో e-PoS డివైజ్‌ కలిగిన ఏ రేషన్‌ దుకాణంలోనైనా బయోమెట్రిక్‌ వివరాలు సమర్పించి ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా వలస కార్మికులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది.

రేషన్‌కార్డ్‌ పోర్టబిలిటీ ద్వారా గడిచిన 11 నెలల్లో 80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో పంపిణీ చేసినట్లు ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి నెలా సగటున 2.5 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపింది. 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పోర్టబిలిటీ కింద 125 కోట్ల లావాదేవీలు జరిగాయని, 241 లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద ఉచితంగానే కేంద్రం ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. సరాసరి నెలకు 38-41 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. మరోవైపు రేషన్‌ దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్‌ బియ్యం అందించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రారంభించింది. 2024 మార్చి నాటికి అన్ని రేషన్‌ దుకాణాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z