* కటకటాలపాలైన ఐపీఎస్ అధికారి
ఎస్పీ నవీన్ కుమార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అకాడమీలో ఎస్పీగా పని చేస్తున్న నవీన్..రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన నవీన్ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు నకిలీ పత్రాలు కూడా సృష్టించారు. ఈ మేరకు భన్వర్‌లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. 41 సీఆర్పీసీ కింద నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు.
* కొరియా నటుడు మృతి
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పారాసైట్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యూన్( Lee Sun-kyun) అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లోని పార్క్‌లో నిలిపి ఉంచిన వాహనంలో ఆయన ఆపస్మారక స్థితిలో ఉండగా గుర్తించారు. ఆయన రాసినట్లు భావిస్తున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.దక్షిణ కొరియాకు చెందిన లీ సన్-క్యూన్ వయస్సు 48 సంవత్సరాలు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రఖ్యాత కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత 2001లో ‘లవర్స్’ అనే టీవీ షో ద్వారా తెరంగేట్రం చేశారు. ‘పారాసైట్’లో సంపన్నుడిగా నటించారు. 2019లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. లీ చివరగా ఈ ఏడాది ‘స్లీప్’ చిత్రంలో మెరిశారు. డ్రగ్స్ వాడిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. నటుడిగా ఎందరో అభిమానాన్ని చూరగొన్న ఆయన.. ఈ కేసు కారణంగా పలు ప్రాజెక్టులను కోల్పోయినట్లు సమాచారం. అక్టోబర్‌లో డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పోలీసు స్టేషన్‌కు వచ్చిన లీ సన్-క్యూన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న నా కుటుంబానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. అక్రమంగా డగ్స్ వినియోగించడాన్ని దక్షిణ కొరియాలో తీవ్రంగా పరిగణిస్తారు. విదేశాల్లో చట్టబద్ధంగా గంజాయి తీసుకున్నా సరే.. స్వదేశానికి వచ్చిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
* ముంబై నుంచి దుబాయ్‌కు సాహిల్
ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వద్ద అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్.. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్‌తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సాహిల్‌కు బదులు డ్రైవర్ వచ్చారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు నిరాకరించిన పోలీసులు సాహిల్‌ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోజునే సాహిల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
* డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ ఒకరు మృతి
ద్విచక్ర వాహనం(Bike) డివైడర్(Divider)ను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన ములుగు(Mulugu) జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులో హనుమకొండ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. మృతుడు ఎటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురం గ్రామానికి చెందిన మల్యాల అనిల్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
* మంచిర్యాల జిల్లాలో తల్లీకుమార్తె ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా మందమర్రిలో తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్-ధనలక్ష్మి దంపతులు ఇక్కడ అప్పడాల వ్యాపారం చేస్తున్నారు. పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ధనలక్ష్మి (36), ఆమె కూతురు జీవని (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుమారుడు సిద్ధూ ఉదయం లేచి చూసేసరికి తల్లి, అక్క శవాలుగా కనిపించడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ నిన్న రాత్రి నుంచి రాకపోవడం.. అతడి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఘటనా స్థలాన్ని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి , ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –