జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు కల్యాణ్ రామ్. ఈ ఏడాది ఆరంభంలో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు ‘డెవిల్’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు కల్యాణ్‌రామ్.
డెవిల్’తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
‘‘ఈ కథను 2021లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు తొలిసారి వినిపించాడు. 1942 నేపథ్యంతో తను ఈ కథను అల్లుకున్న విధానం.. షెర్లాక్ హోమ్స్ సినిమాల తరహాలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్, అలాగే నా పాత్రను తీర్చిదిద్దిన తీరు.. అన్నీ నాకు చాలా నచ్చాయి. నేను ఈ కథ వినే సమయానికి ‘బింబిసార’ చిత్రీకరణ సగ భాగానికి పైగానే పూర్తయ్యింది. అదెంత కమర్షియల్ హిట్ కానుందనే విషయం అప్పటికే అర్థమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ ‘డెవిల్’ కథలో ఇంకొన్ని వాణిజ్యాంశాలు జోడించమని నాకు అనిపించిన మార్పులు చెప్పాను. ఆ తర్వాత తను ఏడాది పాటు కష్టపడి అన్ని మార్పులు చేసి.. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. దాని తర్వాత పూర్వ నిర్మాణ పనులకు మరో ఏడాది పట్టింది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది’’.
‘అమిగోస్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కదా. ఈ చిత్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
‘‘నేను ప్రతిసారీ ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలనే ప్రయత్నిస్తాను. కానీ, కొన్నిసార్లు దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవుతుంటాయి. దాని వల్ల మన ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవచ్చు. దానికి ‘అమిగోస్’ ఉదాహరణ’’.
మీరు నటుడిగానే కాక నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఓ కథను ఎంచుకునే విషయంలో ఏ కోణం నుంచి ఎక్కువగా ఆలోచిస్తారు?
‘‘ఓం’ చిత్రం తర్వాత నాకు ఒక విషయం బాగా అర్థమైంది. నటుడిగా.. నిర్మాతగా ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదని తెలుసుకున్నా. ఎందుకంటే నటనలో ఎంత కష్టపడాలో నిర్మాతగా అంతకు మించి కష్టపడాలి. కాబట్టి హీరోగా చేసేటప్పుడు నటుడిగానే ఆలోచిస్తా. మా బ్యానర్‌లో చేసే సినిమాల విషయానికొస్తే కథలు వింటాను కానీ, మిగిలిన నిర్మాణ వ్యవహారాలన్నీ మా హరికృష్ణ చూసుకుంటారు’’.
ఈ చిత్ర కథ ఎలా ఉండనుంది? దీంట్లో దేశభక్తి అంశాలు ఏ మేరకు ఉంటాయి?
‘‘ఈ కథ ఎలా ఉంటుందన్నది ట్రైలర్‌తోనే స్పష్టత ఇచ్చేశాం. ఓ మర్డర్ మిస్టరీ అంశంతో సినిమా మొదలవుతుంది. దానికి.. సీక్రెట్ సర్వీస్‌కు ఉన్న లింకేంటన్నది ఆసక్తికరం. దీంట్లో దేశభక్తి అంశాలు ఏ మేరకు ఉంటాయన్నది సినిమా చూసే తెలుసుకోవాలి. అన్ని రకాల వాణిజ్య హంగులతో నిండిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఆ మేళవింపే నాకు కొత్తగా.. ప్రత్యేకంగా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథతో రూపొందింది. కాకపోతే సినిమా చూసే ప్రేక్షకులకు ఇదెక్కడైనా జరిగిందేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం. ఆర్ట్ వర్క్ అందర్నీ 1940ల కాలానికి తీసుకెళ్లిపోతుంది’’.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘‘ఈ సినిమాలో నేను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తా. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా నేనెలాంటి కసరత్తులు చేయలేదు. కథ.. దాంట్లోని నా పాత్ర కొత్తగా ఉన్నాయంటే చాలు దానికి తగ్గట్లుగా నా నటన, నడత, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ మారిపోతాయి. దాని కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాల్సిన పనిలేదు. ‘బింబిసార’, ‘డెవిల్’ విషయాల్లో ఇదే జరిగింది. దీంట్లో నా పాత్రలో ప్రతినాయక ఛాయలేమీ ఉండవు. సినిమా చాలా డీటైలింగ్‌తో ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి వస్తువు కథతో లింకై ఉంటుంది’’.
‘దేవర’ ఎంత వరకు పూర్తయింది.. గ్లింప్స్ సంక్రాంతికి వచ్చే అవకాశముందా?
‘‘దేవర’ ఇప్పటి వరకు 80శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. గ్లింప్స్ ఎప్పుడన్నది దాన్ని మేము చూసుకొని.. మాకు సంతృప్తిగా అనిపించాక చెప్తాం. ఎందుకంటే మేము చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం. అందుకనే అవుట్‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మా ఇద్దరికీ క్లారిటీ వచ్చిన కూడా క్లియర్‌గా లేకపోతే ఏ న్యూస్‌పై స్పందించకూడదని నిర్ణయించుకున్నాం’’.
‘డెవిల్’కు సీక్వెల్ ఉంటుందా?
‘‘సీక్వెల్ చేయాలన్న ఆలోచనైతే ఉంది. దీనిపై చర్చ కూడా జరిగింది. 40శాతానికి పైగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాం. ఓ దశలో షూటింగ్ కూడా చేయాలనుకున్నాం. కానీ, ఆ తర్వాత వద్దనుకున్నాం. డిసెంబరు 29న ఈ చిత్రానికి వచ్చే స్పందన చూసి సీక్వెల్ ప్రకటిస్తాం’’.
‘బింబిసార 2’ ఎప్పుడు మొదలవుతుంది?
‘‘ఇటీవలే కొత్తగా ఓ చిత్రం పట్టాలెక్కించాం. అది పూర్తయ్యాక ‘బింబిసార 2’ ప్రారంభిస్తాం’’
👉 – Please join our whatsapp channel here –