సేవా కార్యక్రమాలకు విలువ-వ్యాప్తి ఉండాలని, హామీలకు ఆచరణ భాగ్యం ఉండాలని 2023 తానా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డా. నరేన్ కొడాలి అన్నారు.
గుడ్డిగా సేవా కార్యక్రమాలు చేసుకుపోవడం కాకుండా వాటి విలువను గ్రహించాలని, హెచ్చుతగ్గులను నియంత్రించుకుంటూ వ్యాప్తిని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సదా సిద్ధంగా ఉంచుకోవడమే తన సూత్రమని పేర్కొన్నారు. ఎడారిలో వర్షం మాదిరి హామీల వలన ప్రయోజనం శూన్యమన్న కొడాలి, ఆచరణ సాధ్యం కాని మాటల వలన మొదటికే మోసం వస్తుందని వెల్లడించారు. అందుకే విలువ ఆధారిత సేవలు, ఆచరణాత్మక సేవలకు తాను తన ప్యానెల్ సభ్యులు కట్టుబడి ఉన్నామని, తమకు ఓటు వేసి విజయాన్ని అందించాలని నరేన్ తానా సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
“తానా” స్వర్ణోత్సవాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు శాశ్వత భవనం అవసరమే గాక తప్పనిసరి అని నరేన్ తెలిపారు. దీన్ని సాకారం చేసుకునేందుకు తాను ఉడుతా భక్తిగా లక్ష డాలర్లు ఇవ్వడమే గాక ప్రవాసులను సైతం ఇందులో భాగస్వామ్యులను చేస్తూ రెండున్నర లక్షలు నిధులు సమీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
సంస్థ ఔన్నత్యాన్ని కాపాడాలంటే ఔచిత్యమైన కార్యక్రమాలు వెన్నెముక అని నరేన్ అన్నారు. 3లక్షల50వేల మంది F1-H1 ప్రవాస తెలుగువారు అమెరికాకు వస్తే అందులో 33వేల మంది తానాలో సభ్యులుగా జేరారని వీరందరికీ కేవలం ఇమ్మిగ్రేషన్ సేవలకే పరిమితమైనది కాకుండా అమెరికాలో ఎదుర్కొనే ఎన్నో న్యాయపరమైన చిక్కుముడులను విప్పే ఆసరాగా ఓ ఉచిత స్వచ్ఛంద న్యాయ సేవా విభాగాన్ని తానాకు అనుబంధంగా ఏర్పాటు చేయాలని తన లక్ష్యమని అన్నారు. ఈ హామీ నిర్వహణకు 50వేల డాలర్లు ఇస్తున్నానని వెల్లడించారు. గృహహింస, రోడ్డు ప్రమాదాలు, పోలీసు చలానాలు, విద్యాపరమైన న్యాయ సేవలు వంటి వాటిని కూడా ఈ న్యాయ విభాగం ద్వారా అందిస్తామని నరేన్ తెలిపారు.
“విధేయత-విశ్వసనీయత-ప్రభావవంతమైన సేవ” అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాను చెప్పిన మాటకు, చేసే పనికి గౌరవం ఇస్తానని, కావున తనను తన ప్యానెల్ సభ్యులను తానా ఓటర్లు గెలిపించవల్సిందిగా డా. నరేన్ కొడాలి కోరారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z