DailyDose

వైకాపా అగ్ర నేతల్ని కొట్టేవాళ్లే లేరు!

వైకాపా అగ్ర నేతల్ని కొట్టేవాళ్లే లేరు!

నిబంధనల్ని కాలదన్ని ఇసుకలో ఏటా దోస్తున్న సొమ్ము రూ.1,000కోట్లు సహజ వనరులు ప్రజల సొత్తు… అలాంటి వాటిని చెరబట్టడంలో… ప్రకృతి సంపదను దోచేయడంలో… వైకాపా అగ్ర నేతల్ని కొట్టేవాళ్లే లేరు…!

ఆ ‘పెద్దాయన’ది మరీ అందెవేసిన చేయి..!!

ఆయనకు ప్రభుత్వంలో నంబరు-2గా పేరు.. గనులను పీల్చిపిప్పి చేయడంలోనైతే నంబరు-1…
వాటి నుంచి ఆస్తులను వెనకేసుకోవడంలో ‘గనా’పాటి… ఆయన అనుచరులు ప్రభుత్వ శాఖను చెరబట్టారు!
అధికారులకు వారు గీసిందే సరిహద్దు…వారు చూపిందే లెక్క…మొత్తానికి గనుల శాఖ ఇప్పుడు…మున్సిపాలిటీ పట్టించుకోని మురుగుకాలువలా మారింది!

గనుల శాఖలో ‘పెద్దాయన’, ఆయన అనుచరులు, బినామీలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే గుత్తేదారులదే రాజ్యం. వారు చేసిందే చట్టం. ఈ శాఖను ఆ పెద్దాయన పూర్తిగా వాళ్లతోనే నింపేసి, దాన్నో పక్కా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా మార్చేశారు. ప్రభుత్వానికి అధికాదాయం సమకూర్చే వనరుల్లో ఖనిజ సంపద కీలకమైంది. అలాంటి గనుల శాఖను పెద్దాయన, ఆయన కుమారుడు వారి సొంత ఎస్టేట్‌లా మార్చుకున్నారు. పెద్దాయన, ఆయన అనుచరులు రాష్ట్రం నలుమూలలకు ఆక్టోపస్‌లా చేతులు చాపి.. లాభసాటి గనులను భయపెట్టో, బెదిరించో లాగేసుకున్నారు. అధికాదాయం వచ్చేవన్నీ పెద్దాయన పరమయ్యాయి. మిగతావి అనుయాయులు పంచేసుకున్నారు. సీనరేజీ వసూళ్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారంటే వారి పెత్తనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్ద అండదండలు దండిగా ఉండటంతో పెద్దాయనకు ఎదురులేకుండా పోయింది. ఆయన తన అడుగులకు మడుగులొత్తే అధికారుల్ని కీలక స్థానాల్లో నియమించుకుని, బినామీల్ని సామంతులుగా పెట్టుకుని దందా నడిపిస్తున్నారు. మొదట ప్రైవేటు సంస్థల ముసుగులో, తర్వాత నేరుగా వైకాపా నాయకుల్నే రంగంలోకి దించి ఇసుకలో రూ.కోట్లు దిగమింగడం, సీనరేజీ వసూళ్లను అధికార పార్టీ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం, గతంలోనే లీజుకి తీసుకున్న గనుల యజమానుల్ని బెదిరించి వాటిని స్వాధీనం చేసుకోవడం, అస్మదీయులకు గనులను దొడ్డిదారిన కట్టబెట్టడం వరకు వారు చేయని అక్రమం లేదు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ అయిదేళ్లలో ప్రకృతి వనరుల దోపిడీ జరిగింది. నిబంధనల్ని ధిక్కరించి, కోర్టు ఉత్తర్వుల్ని బేఖాతరు చేసి… ఇసుకలోనే ఏటా రూ.వెయ్యి కోట్లకు తగ్గకుండా దోచేస్తున్నారు. విపక్ష నాయకులకు చెందిన గనులపై కక్షగట్టి భారీ పెనాల్టీలు వేయిస్తామని బెదిరించడం, వారిని భయపెట్టి అధికార పార్టీకి దాసోహం చేసుకోవడం, దారికి రానివాళ్లను తీవ్ర స్థాయిలో వేధించడం ఇలా ఆ పాపాల చిట్టా చాలా పెద్దదే..!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z