DailyDose

జనసేనలో చేరిన వైసీపీ నేత-తాజా వార్తలు

జనసేనలో చేరిన వైసీపీ నేత-తాజా వార్తలు

పొన్నం ప్రభాకర్ సంచలన డిమాండ్

అప్పులు కాదు, సంపద సృష్టించామంటూ స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు.. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై సౌధపత్రం విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజాపాలన కార్యక్రమంపై కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలేదు.. కానీ ప్రభత్వాన్ని స్వేద పత్రం పేరు మీద నాయకులు విమర్శచేస్తున్నారని అన్నారు.తెలంగాణకు అప్పులు పెరిగాయని, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. దీనిపై సౌధ పత్రం ఇవ్వాలన్నారు. ఎన్ని బంగ్లాలు కట్టారు, ఎన్ని ఫామ్ హౌస్‌లు కట్టారు, వందల కోట్ల డబ్బులు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్టీసీకి కొత్త బస్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

* జనసేనలో చేరిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులున్నాయి.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇక, విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారారు. ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ జనసేనలో చేరారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది అనవ పవన్ పేర్కొన్నారు.

అన్నా రాంబాబు సంచలన నిర్ణయం

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు అన్నా రాంబాబు వెల్లడించారు.కాగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు విజయసాధించారు. 2014 ఎన్నికల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపొందారు. అయితే 2009లో ప్రజారాజ్యం తరపున అన్నా రాంబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పుడు అన్నా రాంబాబు సైతం అదే బాటలో నడుస్తున్నారు.

కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించ వద్దు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలి.ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో భాగంగా వైద్య ఖర్చులను రూ.10 లక్షలకు పెంచాం. మరో నాలుగు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దరఖాస్తుల స్వీకరణ మొక్కుబడిగా కాకుండా అధికారుల్లోనూ మార్పు వచ్చిందని ప్రజలు భావించేలా ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. స్వీకరణ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దళారులు తయారు అవుతారు. పదేళ్ల తర్వాత అవకాశం వచ్చిన దృష్ట్యా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

* జర్నలిస్టు రాహుల్ పేరు ప్రస్తావించిన సీఎం

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి స్వీకరించబోయే దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి లోగో రివీల్ చేశారు.అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుసగా జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాహుల్ కూడా ఓ ప్రశ్న అడగటానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సీఎం ‘రాహుల్ చెప్పండి’ అంటూ ముందే సరదాగా అడగటంతో అందరూ ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు ‘ఈ వార్త మా రాహుల్ రాయాలి’ అంటూ ప్రెస్‌మీట్లలో సరదాగా ప్రస్తావించడంతో జర్నలిస్ట్ రాహుల్ ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశాడని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి ప్రధానిని నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

కుల గణనతో బీసీలకు ఎంతో మేలు జరుగుతుంది!

రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు.. ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. అలా.. నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు సీఎం వైఎస్ జగన్ బీసీల ఉన్నతికి పాటుపడుతున్నారని ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణాజిల్లా, గుడివాడలో నిర్వహించిన బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. బీసీ జెండా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పిట వేస్తుందని తెలిపారు. బీసీ సోదరులంతా ఏకతాటి పైకి వస్తే 50 శాతం రిజర్వేషన్లు సాధించవచ్చు అన్నారు.చట్టాలు లేకపోయినా ప్రభుత్వ మరియు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు కొడాలి నాని.. కుల గణనతో బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.. వైసీపీ అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు, ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. నాడు ఎన్టీఆర్, వైఎస్సార్‌ నేడు సీఎం వైఎస్‌ జగన్ కూడా అలాగే బీసీల ఉన్నతికి పాటుపడుతున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z