ప్రమాదాలు చెప్పి రావు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడితే ఫర్వాలేదు. మృత్యువాత పడితే ఆ లోటు తీర్చలేనిది. ఆయా కుటుంబాల వేదన వర్ణనాతీతం. కాబట్టి, ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకోవాలని తపాలా శాఖ సూచిస్తోంది.
రూ.755 చెల్లిస్తే… నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి తపాలాశాఖ అందిస్తున్న బీమాలో ఏడాదికి రూ.755 చెల్లించి చేరవచ్చు. ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ.15లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ. 15 లక్షలు అందుతాయి. ప్రమాదంలో వైద్య ఖర్చులు రూ. లక్ష అందజేస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యం అందితే రోజుకు రూ.1000, ఐసీయూలో ఉంటే రూ.2 వేలు అందిస్తారు. ఒకవేళ చేయి, కాలు ఏదైనా విరిగిపోతే రూ.25,000 ఇస్తారు. పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు. పిల్లల పెళ్లికి రూ. లక్ష అందజేస్తారు.
టాటా ఏఐజీతో కలిసి.. టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ అందిస్తున్న బీమాలో రూ.520 చెల్లించి చేరవచ్చు. ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ. 10 లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షలు అందుతాయి. ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ.లక్ష ఇస్తారు. పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు.
ఏడాదికి రూ. 320: తపాలా శాఖ, టాటా ఏఐజీ కలిసి అందిస్తున్న బీమాలో రూ. 320 చెల్లించి చేరవచ్చు. పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ. 5 లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ.5 లక్షలు అందుతాయి. ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ. 50 వేలు ఇస్తారు.
‘ఈ ప్రమాద బీమా పాలసీలను 18-65 ఏళ్ల వారు తీసుకోవచ్చు. ఈ పాలసీలు తీసుకోవాలంటే ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)లో ఖాతా ప్రారంభించాలి. రూ.100తోనే దీన్ని ప్రారంభించే వీలుంది’ అని తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం చెప్పారు. తపాలా శాఖ కార్యాలయంలో ఎక్కడైనా ఈ పథకంలో చేరవచ్చని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –