* కాటన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ములుగు పరిధిలోని జాకారం గ్రామ సమీపంలో ఉన్న కాటన్ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధం అయింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
* హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం గురువారం లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.
* బలవంతంగా మతం మార్చి ముస్లిం మహిళతో వివాహం
తన భర్తను బలవంతంగా మతం మార్చి (Forcible Convertion) ముస్లిం మహిళతో పెళ్లి చేశారని ఒక వ్యక్తి భార్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌లోని మౌధాలో నాయబ్ తహసీల్దార్‌గా ఆశిష్ కుమార్ గుప్తా పని చేస్తున్నాడు. అయితే తన భర్త అదృశ్యమయ్యాడని, నాలుగు నెలలుగా ఇంటికి రావడం లేదని ఆశిష్ కుమార్ భార్య ఆర్తి గుప్తా కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 24న తన భర్తను బలవంతంగా మతం మార్చి వివాహేతర సంబంధం ఉన్న ముస్లిం మహిళ రుఖ్సార్‌తో పెళ్లి చేశారని ఆరోపించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తనకు తెలిసినట్లు పేర్కొంది.కాగా, ఆర్తి గుప్తా ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆమె భర్త ఆశిష్ కుమార్ గుప్తా, రుఖ్సార్, ఆమె తండ్రి మౌల్వీ, మున్నా, ఆధాతి, మరి కొందరిపై కేసు నమోదు చేశారు. మౌల్వీ, మున్నాను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు మౌదాహాలోని మసీదులో ఆశిష్ గుప్తా నమాజ్ చేసేవాడని సంరక్షకుడు తెలిపాడు. మహ్మద్ యూసఫ్‌గా అతడు పరిచయం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే దీని గురించి తమకు తెలియదని మౌదాహ తహసీల్దార్ బలరాం గుప్తా వెల్లడించారు.
* యువకుడు చేసిన వేధింపులకు యువతి ఆత్మహత్య
ప్రేమించమంటూ యువకుడు చేసిన వేధింపులకు యువతి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏలూరులో బుదవారం చోటుచేసుకుంది. ఏలూరు పోణంగి దక్షిణపు వీధి పెద్దదేవుడి గుడి ప్రాంతానికి చెందిన గెడ్డం వీణా మాధురి (18) 10వ తరగతి చదివి ఇంటి వద్ద ఉంటున్నారు. వడ్డెరగూడెం చిరంజీవి బస్టాండ్ సమీపంలో ఉంటున్న యువకుడు వేముల మోషే యువతిని ప్రేమిస్తున్నానంటూ గతంలో వెంటపడ్డారు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయయంతో మోషేను పోలీసులకు అరెస్టు చేశారు. ఇటీవల మోషే బెయిల్‌పై బయటకు విడుదల అయ్యారు. అయితే మోషే మళ్లీ ఫోన్లో వేధింపులకు గురిచేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీణా మాధురి తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు. తల్లి దండ్రులు గమనించి వీణా మాధురిని సర్వ జన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మోషే వేధించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని యువతి తండ్రి సురేష్ కుమార్ ఆరోపించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* బైపీసీ విద్యార్థి ఆత్మహత్య
తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్థిని తనువు చాలించిన ఘటన హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో జరిగింది. శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహంలో ఉంటోంది. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు చెప్పారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు నాగర్‌కర్నూల్ జిల్లా వీపనగండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –