* మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న మంత్రులు
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి డిసెంబరు 29న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులు మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ, నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు.
* టీటీడీ ఛైర్మన్ పై పురంధేశ్వరి విమర్శలు
ఇటీవల కాలంలో తిరుమలలో ఏర్పాట్లు సరిగా లేవనే ప్రచారం జరుగుతోంది. శ్రీవారి అన్న ప్రసాదంలోనూ నాణ్యత లోపించినట్లు ఈ మధ్య కాలంలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా భూమనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని ఆమె వ్యాఖ్యానించారు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ నిధులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్‌ది స్టిక్కర్ల ప్రభుత్వమని విమర్శించారు. ఏపీకి కేంద్రం విడుదల చేస్తున్న నిధులనూ పక్కకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందించడం లేదని భూమన కరుణా కర్ రెడ్డిపై పురంధేశ్వరి మండిపడ్డారు.
* సజ్జనార్ సీరియస్ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు శత్రువులుగా చూస్తే వారిపై దాడి చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని దూషించడం, దాడులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఏమాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు అధికారులు స్థానిక పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. డ్రైవర్లపై, కండెక్టర్లపై దాడి చేస్తే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లు సహనం పాటించాలని కోరారు. మాటి మాటికి ఇదే రిపీట్ అయితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీసు వద్ద కొందరు ప్రయాణికులు ఆటోలో వెళ్లేందుకు కూర్చున్నారు. అప్పుడే ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటువైపు వచ్చింది. ఆటోలో నుంచి దిగిన ప్రయాణికులు బస్సును నిలిపివేశారు. అసలే కస్టమర్లు లేక ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్లు ఆటో దిగడంతో ప్రయాణికులు ఆగ్రహం చెందారు… ఈ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. ఆటోవాలాలు బస్సు డ్రైవర్‌ను బయటకు లాగి దాడి చేశారు. అతడిపై నీళ్లు చల్లుతూ దుర్భాషలాడుతూ దారుణంగా ప్రవర్తించారు. బస్సు కండక్టర్‌తో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారులు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆటోడ్రైవర్లు ఎవరి మాట వినకుండా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ కె.నాగరాజు తనపై జరిగిన దాడిని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత ఆర్టీసీ డ్రైవర్ నుంచి దాడికి సంబంధించిన వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్లను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
* ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి విశేష స్పందన
ఆరు గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. గ్రామ, వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. మరోవైపు, అభయహస్తం దరఖాస్తు ఫామ్‌లు అందడం లేదని పలు చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దళారులు జిరాక్స్ సెంటర్ల వద్ద రూ.50 నుంచి రూ.100 విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని చందానగర్ ఈసేవా కేంద్రం వద్ద స్థానికుల ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి లైన్లో వేచిచూస్తున్నా.. అభయహస్తం దరఖాస్తు ఫామ్‌లు ఇవ్వడం లేదన్నారు. కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్ వార్డు కార్యాలయంలో సైతం దరఖాస్తు ఫామ్‌లు ఇవ్వడం లేదని స్థానికులు నిరసనకు దిగారు.
* అచ్చెన్నాయుడు కామెంట్స్‌పై స్పందించిన జోగి రమేష్ కౌంటర్
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.మాకు దమ్ముంది.. ప్రజలంటే ప్రేమ ఉంది. అచ్చెన్నాయుడు ఎక్కడికి రావాలో చెప్పు.. మేం అమలు చేసిన మ్యానిఫెస్టో పై చర్చకు సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు మావే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మ్యానిఫ్యాస్టోను టీడీపీ లాగా దిండు కింద పెట్టలేదని, పచారి కొట్లో అమ్ముకోలేదని విమర్శించారు. పెద్ద ముత్తాయిదులు అందరూ కలిసి మ్యానిఫెస్టో ఫెయిల్ అయ్యిందని అంటున్నారని, అంత బాగా చేస్తే మీరు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారు?? అని ఎద్దేవా చేశారు. టీడీపీకి తెగులు పట్టిందని, చంద్రబాబుకే గ్యారెంటీ లేదన్నారు.చంద్రబాబు ఇంటి అడ్రస్ ఎక్కడ?? ఆధార్ కార్డు ఎక్కడ?.. ఏపీలో డోర్ నెంబర్, ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు లేని వాళ్లకు రాష్ట్రంతో ఏం పని…? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, ప్రజలు చంద్రబాబును నమ్మరన్నారు. చంద్రబాబుది దిక్కుమాలిన మ్యానిఫెస్టో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని మేం చెప్పామా అచ్చెన్నాయుడు? ఇటువంటి డ్రామాలు చంద్రబాబు దగ్గర వెయ్యి…మా దగ్గర కాదు అంటూ అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇచ్చారు.
* జపాన్‌లో భారీ భూకంపం
జపాన్ దేశంలో గురువారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు జపాన్‌లోని కురిల్ దీవుల్లో భూమి ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ భూకంపం వల్ల ఏమైనా ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జపాన్‌లో గత అక్టోబర్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్‌లోని తోరిషిమా ద్వీపం సమీపంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. టోక్యోకు దక్షిణంగా 550 కిమీ (340 మైళ్లు) దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కేంద్రీకృతమైందని జపాన్ భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది.అంతకుముందు ఈ ఏడాది జూన్‌లో కూడా ఉత్తర జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో భారీ భూకంపం తీవ్ర భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. అయితే, ఆ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్థి నష్టం గానీ జరగలేదు.
* సత్యసాయి జిల్లా వైసీపీలో నిరసన
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు పెనుకొండలో బాధ్యతలు చేపడుతానని మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు చేసిన వెంటనే శంకరనారాయణ మద్దతుదారులు నిరసన గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి శంకర్ నారాయణకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకరన్న ముద్దు.. బయట వ్యక్తులు వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.మరోవైపు కదిరి నియోజకవర్గం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే కేటాయించాలంటూ మద్దతుదారులు రోడ్డెక్కి నినాదాలు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు సమావేశాన్ని ఏర్పాటు చేసి సిద్ధారెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని.. లేకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –