46 సంవత్సరాల తానా చరిత్రలో 2023కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పదవుల పందేరానికి కోర్టు మోకాలొడ్డటం, రద్దైన ఎన్నికలు తిరిగి నిర్వహించడం వంటి నక్షత్రాల నడుమ ఈ-ఓటింగ్ ప్రక్రియ పౌర్ణమి చంద్రుడిగా దేదీప్యమానంగా వెలుగొందడం ముదావహం. ఈ-ఓటింగ్ ప్రక్రియలో ఒకే ఫోను నెంబరు నుండి రెండు కన్నా ఎక్కువ ఓట్లు వేసినా, ఒకే ఐపీ చిరునామా నుండి నాలుగు కన్నా ఓట్లు వేసినా ఆయా ఓట్లను మొత్తంగా రద్దు చేయడం తానా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన బ్యాలెట్ కలెక్టర్ల మొహాన పిడిగుద్దు వంటిది!
ఎవరికి ఎవరు ఓటు వేస్తున్నారో తెలియని సందిగ్ధావస్థలో, గుంభనంగా సాగుతున్న ఓటింగ్ సరళితో అభ్యర్థులు ఎవరికి వారే తమదే గెలుపని ధీమాగా ఉన్నారు. జనవరి 17 వరకు ఈ-ఓటింగ్ ప్రక్రియ ద్వారా తానా జీవితకాల సభ్యులుగా ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. జనవరి 19న విడుదల కానున్న ఫలితాలు చాలా పదవుల విజేతలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. తనని తాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నవారు సైతం ఆఖరి నిముషంలో బరిలో దిగి ఓట్లు కోసం పాట్లు పడక తప్పలేదు.
రోబో ఫోన్ కాల్స్, ఇంటింటికీ కరపత్రాలు, యూట్యూబ్‌లో ప్రకటనలు, టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు, సొంత సామాజిక మాధ్యమాల్లో బాకా బజాయింపులు కొత్త కానప్పటికీ ఈ-ఓటింగ్ ప్రక్రియ ద్వారా ప్రవాసుల్లో తానా పట్ల కొంత సానుకూల ధోరణి పెరిగిందని చెప్పవచ్చు. పక్క వీధిలో, పక్క నగరంలో, పక్క రాష్ట్రాల్లోని మిత్రుల బ్యాలెట్లను పోగుచేసుకొచ్చి విజేతలను ముందుగా నిర్ణయించేసే ప్రక్రియ నుండి అభ్యర్థుల సతీమణులు, పతీరత్నాలు సైతం తాము ఎవరికి ఓటు వేశారో కూడా బయటకు పొక్కనీయని పక్కా వ్యవస్థకు వృద్ధి చెందిన తానా ఎన్నికల నిర్వహణకు ప్రవాసులు జేజేలు పలుకుతున్నారు. ఈ నిశ్శబ్ద విస్ఫోటనం తానాకు సరికొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
2023 తానా ఎన్నికల బరిలో పోటీపడుతున్న అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు!
—సుందరసుందరి(sundarasundari@aol.com)
###############
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z