మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు.
‘‘పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాది దొరల ప్రభుత్వం కాదు. ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. మీ దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తాం’’ అని భట్టి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, హనుమంతరావు, శ్రుతి ఓజా, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.
‘అభయహస్తం’లో పైరవీలకు అవకాశం లేదు: పొన్నం
నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ‘‘ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోంది. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు’’ అని పొన్నం స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –