Business

బోయింగ్‌కు ఆగని కష్టాలు

బోయింగ్‌కు ఆగని కష్టాలు

వైమానిక రంగ దిగ్గజం బోయింగ్‌కు ‘737 మ్యాక్స్‌’ కష్టాలు వదిలేట్లు లేవు. గతంలో వరుస ప్రమాదాలతో హడలెత్తించిన ఈ రకం విమానంలో తాజాగా మరో సమస్య తలెత్తింది. ఇటీవల రెండు 737 మ్యాక్స్‌ విమానాల్లో కీలకమైన భాగంలో బోల్టులకు నట్లు లేనట్లు గుర్తించారు. విమానం పనితీరును నియంత్రించే కీలకమైన రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో ఈ లోపాన్ని పేరు వెల్లడించని ఓ విమానయాన సంస్థ గుర్తించింది. మరో విమానంలో ఈ బోల్ట్‌ను సరిగా బిగించలేదని గమనించింది. విమానాన్ని గాల్లో స్థిరంగా ఉంచేలా రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థ పనిచేస్తుంది.

అసలే దాదాపు ఐదేళ్ల క్రితం వరుస ప్రమాదాలతో హడలెత్తించిన 737 మ్యాక్స్‌లో ఈ లోపాన్ని గుర్తించడంతో బోయింగ్‌ ఒక్కసారిగా అప్రమత్తమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1,370 ఈ రకం విమానాల్లో ఇటువంటి సమస్య ఏమైనా ఉందేమో ఆయా విమానయాన సంస్థలు సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ‘‘మేము ఆ విమానాల్లో గుర్తించిన సమస్యను సరిచేశాము. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన 737 మ్యాక్స్‌ విమానాల్లో ఈ సమస్య ఏమైనా ఉందేమో సరిచూసుకోవాలని కోరుతున్నాం’’ అని బోయింగ్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో కోరారు. ఒక యాక్సెస్‌ ప్యానెల్‌ను విప్పదీసి బోల్టును చూస్తే సమస్య తెలిసిపోతుందని కంపెనీ పేర్కొంది.

అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిపై ఎఫ్‌ఏఏ స్పందిస్తూ రడ్డర్‌ వ్యవస్థలో లూజ్‌ బోల్ట్‌ల కోసం తనిఖీలు చేపట్టామని పేర్కొంది. విమానంలో ఈ సమస్య ఉంటే పరిష్కరించడానికి రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఆయా విమానయాన సంస్థలు 737 మ్యాక్స్‌ తనిఖీల నివేదికలను తమకు పంపాలని కోరింది. మరెక్కడైనా ఇటువంటి సమస్యను గుర్తిస్తే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పింది.

బోయింగ్‌ సంస్థ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌, క్వాలిటీ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్‌ విషాదంగా ఇది నిలిచింది. ఈ పరిణామాలతో బోయింగ్‌కు దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చింది.

2020 డిసెంబర్‌ నుంచి మళ్లీ ఈ విమానాలు ఎగరడం మొదలుపెట్టాయి. కానీ, ఇతర సమస్యలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 737 మ్యాక్స్‌లో విడిభాగాల సప్లయర్లు కొన్ని నాసిరకం తయారీ విధానాలను అనుసరిస్తున్నట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా బోయింగ్‌పై రెగ్యులేటర్ల నిఘా బలంగా ఉంది. తనిఖీలు కూడా పెరిగాయి. కానీ, అలాంటి సమయంలో కూడా ఓ ప్రధాన వ్యవస్థలో బోల్టు సమస్యతో విమానం ఫ్యాక్టరీని దాటడం బోయింగ్‌కు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎన్ని సురక్షిత ప్రమాణాలు పాటించినా అవి బోయింగ్‌ విషయంలో పనిచేయడంలేదనే అపవాదు ఉంది. ఇక ఈ సంస్థ తయారు చేసే 787 డ్రీమ్‌ లైనర్లలో కూడా సమస్యలు ఉన్నట్లు ఎఫ్‌ఏఏ గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గతేడాది కొంతకాలం డ్రీమ్‌ లైనర్ల డెలివరీలను నిలిపివేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z