రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు, అకృత్యాలకు హద్దే లేదు. ఇచ్ఛాపురం మొదలు హిందూపురం వరకూ రాష్ట్రమంతా వారి నేరాలతో నిత్యం అల్లకల్లోలంగా ఉంటోంది. దళితులు, గిరిజనులపై అకృత్యాలకు లెక్కేలేదు. మహిళలపై పెద్దఎత్తున దారుణాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలపై నిత్యం దౌర్జన్యాలు, దాష్టీకాలే. రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తున్న ఎవర్ని అడిగినా ఇక్కడ నేరాలు పెరుగుతున్నాయనే చెబుతారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లోనూ ఇక్కడి నేరాల తీరు స్పష్టంగా కళ్లకు కడుతుంది. రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితులుంటే డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి మాత్రం నేరాలు తగ్గిపోయాయని ప్రకటించారు. 2022తో పోలిస్తే 2023లో హత్యలు, హత్యాయత్నాలు, కొట్లాటలు, చోరీలు, దోపిడీలు… మహిళలు, దళితులు, గిరిజనులపై నేరాలు, సైబర్ నేరాలు తదితర వాటిల్లో ఏ ఒక్కటీ పెరగకపోగా తగ్గాయని గురువారం విడుదల చేసిన నేరగణాంక నివేదిక-2023లో పేర్కొన్నారు. ఒకవైపు ఇంతస్థాయిలో వైకాపా నాయకుల దాష్టీకాలు, అరాచకాలు జరుగుతుంటే.. నేరాలు తగ్గడమేంటి? అంటే వారి అరాచకాలు, అకృత్యాలను పోలీసులే కప్పిపెడుతున్నారా? నేరానికి పాల్పడినా వారిపై కేసులు నమోదుచేయట్లేదా? బాధితులు ఫిర్యాదిస్తే పట్టించుకోవట్లేదా? జరిగిన ఘటనలన్నింటిపైనా కేసులు నమోదుచేస్తే నేరాల సంఖ్య పెరగాలే కానీ.. తగ్గడమేంటి? గణాంకాల గారడీలతో ఎవరి కళ్లకు గంతలు కట్టాలనుకుంటున్నారు? ఎవర్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు?
అన్నీ దాచేసి నేరాలు తగ్గాయంటే నమ్మేదెలా?
జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై గతేడాది మొత్తం 25,503 నేరాలు జరిగాయి. ఆ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై మొత్తంగా నేరాలు తగ్గాయా.. పెరిగాయా అనేది ఎందుకు చెప్పలేదు? ఈ ఏడాది మహిళలపై జరిగిన మొత్తం నేరాల సంఖ్యను ఎందుకు దాచిపెట్టారు? మహిళలపై జరిగిన నేరాల్లో కేవలం వరకట్న హత్యలు, అత్యాచారాలు, పోక్సో కేసుల గణాంకాలే ప్రకటించి.. మహిళలపై నేరాలు తగ్గిపోయాయని చెప్పడమేంటి? ఈ నాలుగు విభాగాల్లో గతేడాది 3,120 నేరాలు జరగ్గా, ఈ ఏడాది 2,511 చోటుచేసుకున్నాయని ప్రకటించారు. తగ్గుదల ఉన్న అంశాలనే వెల్లడించి పెరిగిన వాటిని వదిలేశారా? మహిళలపై వేధింపులు, కేసుల గురించి ఎందుకు దాచిపెట్టారు?
దళితులు, గిరిజనులపై నేరాల్ని కలిపేసి… తగ్గినట్టు చూపించి
దళితులు, గిరిజనులపై జరిగిన నేరాలు కలిపేసి తగ్గినట్లు చూపించారు. దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడుల వివరాలివ్వలేదు. గిరిజనులపైనా ఏయే నేరాలు ఎన్నెన్ని జరిగాయి? అవి గతంతో పోలిస్తే పెరిగాయా? తగ్గాయా? అనేది పేర్కొనలేదు.
కిడ్నాప్‌లను అత్యంత హింసాత్మకమైన నేరాల జాబితాలో పరిగణిస్తారు. కానీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కిడ్నాప్‌లు తగ్గాయా.. పెరిగాయా అనేది వార్షిక నివేదికలో ప్రస్తావించనే లేదు.
2022తో పోలిస్తే 2023లో నమోదైన మొత్తం నేరాలు తగ్గాయని చెప్పారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన నేరాలనే గణాంకాల్లో చూపించారు. ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదైన వాటి ప్రస్తావనే లేదు.
శాంతిభద్రతలకు కొలమానంగా పరిగణించే అల్లర్ల ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటి గణాంకాలను దాచిపెట్టేశారు.
సైబర్ నేరాలు తగ్గాయా? ఫిర్యాదులు తీసుకోవట్లేదా?
ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని వార్షిక నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాల బారినపడ్డ బాధితుల ఫిర్యాదులన్నింటినీ కేసులుగా నమోదు చేస్తే ఆ సంఖ్య అనేక రెట్లు పెరగాలి. కానీ తగ్గాయని చెప్పడం డీజీపీకే చెల్లింది. సైబర్ నేరాల ఫిర్యాదులు స్వీకరించకపోవడం, వాటిని కేసులుగా నమోదు చేయకపోవడం దీనికి ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి.
👉 – Please join our whatsapp channel here –