DailyDose

‘ప్రజాపాలన’ కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన

‘ప్రజాపాలన’ కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్‌ కార్డులు లేని వారినుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711, జీహెచ్‌ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో 4,57,703 అర్జీలు స్వీకరించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనుంది. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా సభల్ని నిర్వహించనున్నారు. తొలిరోజు ఎక్కువగా చిన్న గ్రామాల్లో సభలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెదక్‌ జిల్లా రాంపూర్‌, టి.లింగంపల్లి, చల్లపల్లి గ్రామాల్లో ప్రజాపాలనకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో మహిళా భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళలే ఎక్కువమంది
దరఖాస్తు చేసుకున్నవారిలో మహిళలే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. చాలామంది తమ భార్యల పేరుతో దరఖాస్తు చేయించారు. హైదరాబాద్‌ రాంనగర్‌ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌టీ కమ్యూనిటీ హాలులో మహిళల కోసం ఏర్పాటు చేసిన మూడు కౌంటర్లూ కిక్కిరిసిపోయాయి. పురుషుల కోసం ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు 50 మంది కూడా రాలేదు.

పట్టణాలు, నగరాల్లో దరఖాస్తుల కొరత…ప్రజాపాలన దరఖాస్తు ఫాంలను బుధవారమే అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది ఇంటి వద్దే వాటిని నింపి.. గ్రామ, వార్డు, డివిజన్‌ సభలకు తీసుకువచ్చి అందించారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం దరఖాస్తు ఫాంలు తక్కువగా వచ్చాయి. కొన్నిచోట్ల సరిపడా అందలేదు. అధికారులు అప్పటికప్పుడు తెప్పించాల్సి వచ్చింది. మీసేవా కేంద్రాలు, జిరాక్స్‌ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. కొన్నిచోట్ల దరఖాస్తు ఫాంలను ఎలా నింపాలో అవగాహన లేనివారు అయోమయానికి గురయ్యారు. నిరక్షరాస్యులు ఇబ్బందిపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు ఫాంలు నింపేందుకు డబ్బులు వసూలు చేశారు. కొన్నిచోట్ల దరఖాస్తులు ఎక్కడ ఇస్తున్నారో ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రేషన్‌కార్డులు లేనివారు.. ఆదాయ సర్టిఫికెట్ల కోసం మీసేవా, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇప్పటికే రైతుబంధు సొమ్ము, పింఛన్లు పొందుతున్నవారు సైతం.. మళ్లీ దరఖాస్తు చేయాలా అన్న సందేహంతో వచ్చారు. ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు సమర్పించిన వారికి ఇచ్చిన రసీదుల్లో అధికారులు నంబరు రాయలేదు.

హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ కేంద్రంలో దరఖాస్తు ఫాంలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కేంద్రానికి ఎక్కువమంది కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలుచోట్ల దరఖాస్తులు సరిపోకపోవడంతో అధికారులే జిరాక్స్‌ తీయించి.. ప్రజలకు పంపిణీ చేశారు.

జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని 2,258 కేంద్రాల్లో ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్‌లో దరఖాస్తులు సరిపడా లేకపోవడంతో జిరాక్స్‌ కేంద్రాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.10 నుంచి రూ.50 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.

నిజామాబాద్‌ జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, భూముల సమస్యలు పరిష్కరించాలంటూ తెల్ల కాగితాలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఇలాంటి వారి కోసం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ప్రతి కేంద్రంలోనూ సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబరు ఇవ్వాలని సూచించారు. ఫాంలు నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తు పత్రాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z