Business

పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ తుది హెచ్చరిక

పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ తుది హెచ్చరిక

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్‌ చేయాలని ఆఖరిసారిగా సూచించింది.

ఆలస్యమైన లేదా సవరించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్ చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు ఐటీ శాఖ అవకాశం కల్పించింది. ఇంక రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ చేసింది. ఐటీఆర్‌ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్‌ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. అవసరమైన సమాచారం కోసం వెబ్‌సైట్ లింక్‌ను అందించింది.

ఎవరు చేయాలి?
ఎవరెవరు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయాలనే దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, విద్యుత్ బిల్లుల కోసం 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

ఎవరైనా నిర్దిష్ట సమయంలోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే, వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే ఇందు కోసం ప్రత్యేక ఫారం ఉండదు. పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట అసెస్‌మెంట్ సంవత్సరానికి నోటిఫై చేసిన ఫారాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే ఏమౌతుంది?
ఆలస్యమైన ఐటీఆర్‌ కూడా ఫైల్ చేయకపోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు. సెక్షన్ 234A కింద వడ్డీ విధించడం, సెక్షన్ 234F కింద రుసుము, 10A, 10B సెక్షన్ల కింద మినహాయింపులకు అనర్హత వంటి ఎదురుకావచ్చు. దీంతోపాటు చాప్టర్ 6-A పార్ట్ సి కింద తగ్గింపులు అందుబాటులో ఉండవు.

సెక్షన్ 234F కింద రూ.5,000 (చిన్న పన్ను చెల్లింపుదారులకైతే రూ.1,000) జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపులకు సెక్షన్ 234A కింద నెలకు 1 శాతం చొప్పున జరిమానా వడ్డీ వర్తిస్తుంది.

ఇక దాఖలు చేసిన ఐటీఆర్‌లు 30 రోజులలోపు వెరిఫై కావడం కూడా చాలా కీలకం. వెరిఫై కాని ఐటీఆర్‌ ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఇంకా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్‌ చేయాలని సూచిస్తున్నాం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z