అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో నెలకొల్పే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో ఒకదాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది.
అయోధ్య రామాలయం గర్భగుడిలో బాల రాముడి (Lord Ram Lalla) విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) గతంలోనే ప్రకటించింది. జనవరి 22, 2024న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఈ బాల రాముడికి సంబంధించి.. ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే.. దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల వెల్లడించారు. దీనిపై శుక్రవారం సమావేశమైన కమిటీ ఒకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు, రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16, 2024 నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –