నంది అవార్డులపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌కు ‘నటసింహ చక్రవర్తి’ బిరుదును ప్రదానం చేసి సత్కరించారు.
అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ తరఫున నంది పురస్కారాలపై మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సత్కారం కోసం సినీ పరిశ్రమ ఎదురుచూస్తోందని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయిందని గుర్తు చేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసి గౌరవించాలని కోరారు. మురళీమోహన్ అభ్యర్థనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. త్వరలోనే సినీ పెద్దలను ముఖ్యమంత్రి వద్దకు ఆహ్వానించి అవార్డుల విషయంపై చర్చిస్తామని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –